06-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 5: వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమ వారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై విచా రణను తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయి సారథ్యంలోని ధర్మాసనం చేపడుతుందని స్పష్టం చేసింది.
అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు సుదీర్ఘమైన విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనుండటంతో తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయి మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు.
వక్ఫ్ వ్యవహారంపై గతంలో చేపట్టిన విచారణ సమయంలో వాద ప్రతివాదనలను తమ ధర్మాసనం పరిశీలించిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. రిజిస్ట్రేషన్లపై కొన్ని అంశాలు లేవనెత్తారని, కొన్ని గణాంకాలు వివాదాస్పదంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అందువల్ల దీన్ని పరిష్కరించాల్సి ఉందని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ ధర్మాసనం పేర్కొంది.
మధ్యంతర దశలో ఉన్నా సరే తాను ఎలాంటి తీర్పు, ఉత్తర్వును రిజర్వు చేయదలచుకోలేదని సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై విచారణ జరగాల్సి ఉందన్నారు. వక్ఫ్ అంశంపై పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి పోస్టు చేస్తామని తెలిపారు.