06-05-2025 12:10:55 AM
చేవెళ్ల, మే 5: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా యి. అక్రమార్కులు అసైన్డ్, లావణి, గైరాన్ భూములను పట్టాలుగా మార్చి విక్రయించడమే కాకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. కొన్నాళ్లకు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
సర్వే నంబర్ 108లో 5 ఎకరాలు, 143లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన కొందరు వ్యక్తులు గత డిసెంబర్ లో కబ్జా చేసేందుకు యత్నించారు. గ్రామస్తులు తహసీల్దార్ గౌతమ్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డీటీ, ఆర్‌ఐ, పంచాయతీ కార్యదర్శి భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్, కంటైనర్ హౌస్ ను జేసీబీలతో తొలగించి స్వాధీ నం చేసుకున్నారు.
కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న కబ్జాదారులు ఏప్రిల్ 12న సర్వే నెం. 143లో ఉన్న భూమిని చదును చేసి.. ప్రీకా స్ట్ వేసేందుకు యత్నించారు. గ్రామస్తులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచా రం ఇవ్వగా.. ఆర్‌ఐ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని పనులు ఆపించారు. కాగా, భూకబ్జాదారులు ఈ భూమిని పట్టాభూమి గా చిత్రీకరించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.
107లో లావణి, గైరాన్ భూమి పట్టాగా మార్పు
సర్వే నెం. 107లో 12.16 ఎకరాల లావణి పట్టా భూమి ఉండగా.. 4.39 ఎకరాలు (సర్వే నెం. 107/అ) మహబూబ్ సాబ్ పేరిట నమోదై ఉంది. ఇందులో 2 ఎకరాలను ప్రభుత్వం గైరాన్ కింద కొట్టివేసింది. మిగిలిన 2.39 ఎకరాలను మహబూబ్ సాబ్ పేరిట కంటిన్యూ కాగా... ఆయన వారసులు 2001లో ఇతరులకు విక్రయించారు. లావణి పట్టా అమ్మినా, కొన్నా.. పీవోటీ చట్టం-1977 ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
కానీ, చట్టాన్ని తుంగలో తొక్కి ఈ భూమితో పాటు గైరాన్ భూమిని కలిపి మొత్తం 4.39 ఎకరాలను మహమ్మద్ జానిమియా పేరిట పట్టాగా నమోదు చేశారు. వాస్తవానికి ఈయనకు ఈ భూమితో ఎలాంటి సంబంధమే లేదు. అసలు వారసుల నుంచి తెల్లకాగితం మీద సంతకాలు తీసుకొని నకిలీ డాక్యుమెంట్లతో పట్టా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్కడితో ఆగకుండా 2023 నవంబర్ 10న డాక్యుమెంట్ నెం. 3979/2023 ద్వారా ఈ 4.39 ఎకరాలను భవానీ డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వంగ ప్రణిత రెడ్డికి విక్రయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాంగ్రెస్ మండల నాయకుడు భానూరి శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మార్చి 25న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి.. గ్రామ అవసరాలకు వినియోగించాలని కోరారు.
సర్వే నెంబర్ 155/అలో కొడుకు సమాధి పేరిట కబ్జా
సర్వే నెంబర్ 155/అలో ఉన్న 14 గుంటల ప్రభుత్వ గైరాన్ భూమిని ఏపీకి చెందిన ఓ బడాబాబు తన కొడుకు సమాధి పేరిట ఆక్రమించాడు. కొడుకు మృతదేహాన్ని అందులో సమాధి చేసిన ఆయన చుట్టూ ప్రీకాస్ట్ గోడలు ఏర్పాటు చేసి పెద్ద గేటు పెట్టి వాచ్మెన్ ను కూడా కాపలాగా ఉంచుతున్నాడు. దీనికి ‘రోహిత్ ఆశ్రమం’ అని పేరు కూడా పెట్టాడు.
ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏప్రిల్ 15న గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ భూమిని స్వాధీనం చేసుకొని సదరు బడాబాబుపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు మాత్రం ఇప్పటికే కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చామని.. పైఅధికారులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వ భూములు కాపాడాలి
తోల్కట్ట గ్రామ పరిధిలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నయి. పేదలకు ఇండ్ల కోసమే, రైతుల సాగు కోసమే ఇస్తే ఇబ్బంది లేదు. కానీ, కొందరు ప్రైవేట్ వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి.. అక్రమంగా పట్టా చేసుకుంటున్నరు. వారి చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని... తిరిగి రైతులకు ఇవ్వాలి. లేదంటే పీవోటీ కింద తీసుకొని గ్రామ అవసరాలకు వినియోగించాలి.
భానూరి శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ మండల నాయకుడు
కఠిన చర్యలు తీసుకుంటం
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటం. సర్వే నెంబర్లు 108,143ని కబ్జా చేసేందుకు యత్నించగా అడ్డుకొని స్వాధీనం చేసుకున్నం. 107/అ సర్వే నెంబర్ సంబంధించి నేను ఇక్కడి రాకముందే ఆ వ్యవహారం జరిగింది. అయినప్పటికీ గ్రౌండ్ రిపోర్టును పైఅధికారులకు పంపించినం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటం.
గౌతమ్ కుమార్, మొయినాబాద్ తహసీల్దార్