calender_icon.png 6 May, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నంపెట్టే అన్నదాతను కాపాడుకోవమే ప్రభుత్వ లక్ష్యం

06-05-2025 01:32:57 AM

రైతులు ఆర్థికంగా బలపడేందుకు కృషి: మంత్రి తుమ్మల

వికారాబాద్, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు‘ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అన్నారు.  రైతులు మరింత ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలని, యూరియా, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యానవన పంటలను వేసేలా ప్రోత్సహించాలని సూచించారు.

ఆయిల్ ఫామ్ పంటలు వేస్తే రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. పొలాల్లో ఒకే పంట కాకుండా అంతర పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి, వాటికనుగుణంగా పంటలు సాగు చేపట్టాలని మంత్రి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వంట నష్టపోయిన రైతులకు పంట బీమాను వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

రైతులకు నాణ్యమైన వంగడాలను అందిస్తే, నష్టాల బారిన పడకుండా ఉంటారన్నారు. గతంలో ధరణి వల్ల రైతులు ఎంతగానో ఇబ్బంది పడ్డారని, రైతుల కష్టాలను తీర్చేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ జానయ్య, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.