06-05-2025 12:10:01 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన చేపట్టిన సమ్మె కచ్చితంగా కొనసా గుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. సమ్మె సన్నాహాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్‌భవన్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల కవాతు పేరిట కార్యక్రమం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది వరకు ఆర్టీసీ కార్మికులు కవాతుకు హాజరై బస్‌భవన్ ముట్టడికి యత్నించారు.
అయితే బస్‌భవన్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సమ్మె చేస్తామని ప్రకటించినా ప్రభుత్వంగానీ, యాజమాన్యంగానీ తమను చర్చలకు పిలవలేదని జేఏసీ నేతలు తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి యథావిధిగా సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం చర్చలకు పిలిస్తే తాము సిద్ధంగా ఉన్నామని..
కానీ తాము చివరి ప్రయత్నంగా మాత్రమే సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు తెలిపారు. కార్మికుల కవాతు కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న వెల్లడించారు. తాము 3 నెలల క్రితం సమ్మె నోటీసులు ఇస్తే ఇప్పటివరకు కూడా తమను చర్చలకు పిలవలేదని జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి తెలిపారు.
తమను యాజమాన్యంతో పాటు ఉమ్మడిగా చర్చలకు పిలిచి సమస్యలపై చర్చలు జరపాలని అప్పుడే సమ్మెపై పునరాలోచన చేస్తామన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చిన సంఘాలను కాకుండా సంబంధంలేని వారిని చర్చలకు పిలుచుకోవడం, కార్మికుల మధ్య ఐక్యత లేదని పేర్కొనడం సరైంది కాదని జేఏసీ నేతలు పేర్కొన్నారు. 7వ తేదీన మొదటి బస్సు నుంచే సమ్మె ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు.
తమకు ప్రభుత్వంపై నమ్మకముందని, ఇప్ప టికైనా చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. జేఏసీకో చైర్మన్ హనుమంతుముదిరాజ్, నాయకులు ఎస్.బాబు, డీవీకే రావు, వెంకటిగౌడ్, కమలాకర్‌గౌడ్, యాదయ్యగౌడ్, ఎండీ అహ్మద్‌అలీ, వీ బాబు, కేఎస్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
తలుపులు తెరిచే ఉన్నాయి: మంత్రి పొన్నం
ఆర్టీసీ సమస్యలపై ఎప్పుడైనా కలిసి కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవచ్చని అందుకు తమ తలుపులు తెరుచుకునే ఉన్నాయని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
సోమవారం తనతో భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రి మాట్లాడారు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని..సమస్యలు తొలుగుతున్నాయన్నారు. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని తెలిపారు.
సమ్మె జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, ఒక్క ఉద్యోగ నియామకం చేపట్టలేదన్నారు. సీసీఎఫ్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 2017 పే స్కేల్ 21శాతం ఏడాదికి రూ.412కోట్లు భారం పడుతున్నదన్నారు.
పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ డబ్బులు రూ.1,039కోట్లు చెల్లించామని తెలిపారు. 1,500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామని..త్వరలో ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగాల నియామకం ఉంటుందన్నారు. మంత్రిని కలిసినవారిలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఎన్‌ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఫ్‌ు జనరల్ సెక్రటరీ ఎర్ర స్వామి, ఎస్‌టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె చేస్తే చర్యలు తప్పవు: ఆర్టీసీ యాజమాన్యం
‘ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మె నిషేధం.. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకం. సమ్మె పేరుతో ఉద్యో గులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్రసంక్షోభంలోకి పోయింది..ఆ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కోల్పోయింది. సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలి. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యా జమాన్యం ఏమాత్రం రాజీపడబోదు.’ అని సోమవారం ఒక ప్రకటనలో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.
బెదిరింపులకు తలొగ్గం.. సమ్మె చేస్తాం: ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ యాజమాన్యం బెదిరింపులకు తాము తలొగ్గబోమని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తామంటే కుదరదని సమ్మె కొనసాగుతుందన్నారు. కనీసం చర్చలకు పిలవకుండా ఏకపక్షంగా యాజమాన్యం మాట్లాడుతోందని అన్నారు. మరోవైపు సమ్మెపై జేఏసీ పేరుతో అశ్వత్థామ రెడ్డి చేస్తున్న కుట్రలను కార్మికులు గమనించాలని కోరారు.
2019 సమ్మె సమయంలో కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీని సర్వనాశనం చేసిన కార్మిక ద్రోహి అశ్వత్థామరెడ్డి అని అన్నారు. 7వ తేదీ లోపు కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మికులెవరూ భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు.