11-09-2025 05:40:52 PM
ఎలాంటి అవాంఛనీయ సంఘటన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 5 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కావున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) సూచించారు. జిల్లాలో గురువారం నుండి 5 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందని వాతావరణం శాఖ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని, అదేవిధంగా గ్రామాలు, మండలాలు మరియు మున్సిపాలిటీల వారిగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపలు పట్టుటకు, పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు వెళ్ళరాదని ప్రభుత్వ అధికారుల సూచనలను పాటిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468-2200695 సమాచారం అందించి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.