11-09-2025 05:38:46 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత ఉందని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలో యూరియా కొరతలేదని, సహకార, వ్యవసాయ శాఖ సమన్వయంతో సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతుందని జిల్లా సహకార శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు(District Cooperative Department Officer Venkateshwarlu), జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మలతో కలిసి జిల్లా సహకార శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జిల్లాలో యూరియా సరఫరా పంపిణీ పై పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించడం కోసం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, వ్యవసాయ, సహకార, అన్ని విభాగాలతో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుందని 18 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిశీలిస్తూ నివేదికలు కోరుచూ నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా రైతులను కలుస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారన్నారు. ప్రస్తుతం అందిస్తున్న యూరియా వచ్చే యూరియా వివరాలను క్లస్టర్ల వారిగా రైతులకు సమాచారం అందిస్తూ ఉన్నారని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జిల్లాలో 44 యూరియా అమ్మకాల కేంద్రాలు , 20 రైతు వేదికల ద్వారా మొత్తం 64 కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మరో 10 కేంద్రాల నిర్వహణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అందులో ఇప్పటికే రెండు కేంద్రాలకు లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ప్రతి 2,500 ఎకరాలకు ఒక ఎరువుల అమ్మకాల కేంద్రాలను ఏర్పాటు చేయుటకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే అమ్మకాలను కొనసాగించడం జరుగుతుందని, గతంలో ఎరువుల సరఫరా పంపిణీ సంఘం యొక్క ముఖ్య కేంద్రాలలో మాత్రమే పంపిణీ చేయబడేదనీ, అందువల్ల రైతులు అనేక ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేదనీ ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ సేల్స్ పాయింట్ల వికేంద్రీకరణ వలన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అదనంగా ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయమని ఆదేశించడం వలన 64 కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం ద్వారా రైతుల సమయము వృధా కాకుండా ఉంటుందని అందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 27 వేల 347 మెట్రిక్ టన్నుల యూరియా సహకార సంఘాల ద్వారా సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులు భవిష్యత్తులో యూరియా దొరకదనే అసత్య ప్రచారాలను నమ్మి అవసరానికి మించి గృహాలలో యూరియాను నిలువల ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, రైతుల అవసరానికి అనుగుణంగా యూరియా సరఫరా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం.విజయనిర్మల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల 70 వేల ఎకరాలలో పంట సాగు చేయడం జరిగిందని, మొత్తం నాలుగు లక్షల 20వేల ఎకరాల పంట ఈ ఖరీఫ్ కాలంలో సాగు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటివరకు 27. వేల 347 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ నిత్య పర్యవేక్షణలో రైతులకు 44 సొసైటీలకు అనుసంధానంగా తాత్కాలికంగా విక్రయ కేంద్రాలుగా 20 రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతులకు వారి వారి గ్రామాలలోనే యూరియాను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. అందువలన రైతులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా సమయం వృధా చేయకుండా వారి వారి గ్రామాలకే యూరియా సరఫరా చేయడం వలన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రతినిత్యం జిల్లాలోని సీనియర్ అధికారులను, ప్రత్యేక అధికారులుగా నియమించి వారితో పాటు తహసిల్దార్లు ,ఎంపీడీవోలు, సహకార శాఖ, అన్ని విభాగాల ను సమన్వయపరిచి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో రైతులకు రక్షణ కల్పించడం కోసం సంబంధిత కేంద్రాల కేంద్రాల వద్ద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతు భరోసా పోర్టల్ లో ఉన్నటువంటి వివరాల ప్రకారం రైతులకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ యొక్క పాస్ బుక్ ఆధార్ కార్డు, జిరాక్స్ ప్రతులను తీసుకొని కేంద్రానికి రావాల్సిందిగా కోరారు. జిల్లాలోని రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిరంతరం యూరియా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లాకు అధిక యూరియా కోటా తెప్పించేందుకు కృషి చేస్తూ అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆమె అన్నారు.