28-08-2025 09:39:57 AM
మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో(Medak district) రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) గ్రామాలతో పాటు జనజీవనం అతలాకుతలం అయింది. ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురియడంతో జిల్లాలోని వాగులు, చెరువులు కట్టలు తెగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హవేళీఘణపూర్ మండలం దూప్‌సింగ్ తండా పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. తండాకు చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు చేరి ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్ల స్లాబులపై నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి నుంచి వచ్చే వరద వల్ల దూప్‌సింగ్ తండాను ముంచెత్తింది.
హవేళీఘణపూర్ నుండి ఎల్లారెడ్డి(Havelighanpur to Yella Reddy) వెళ్ళే రహదారిలో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ కారు రోడ్డు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కారులో ఉన్న వ్యక్తులను రక్షించడానికి తక్షణమే ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హవేళీఘణపూర్ చెరువు గండిపడి భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. తిమ్మాయిపల్లి చెరువు పొంగుతుంది. దీంతో గ్రామం నుండి వరద నీరు ప్రవహిస్తోంది.
విద్యార్థినీలను కాపాడిన రెస్క్యూ టీం..
రామాయంపేట పట్టణంలోని గురుకుల మహిళా కళాశాలలోకి వరద నీరు చెరడంతో కళాశాల జలదిగ్భంధంలో చిక్కుకుంది. దీంతో పోలీసులు, అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి విద్యార్థినీలను సురక్షితంగా తరలించారు. అలాగే పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
నీట మునిగిన ఎన్‌హెచ్ 44...
భారీ వర్షాల నేపథ్యంలో కాశ్మీర్ - కన్యాకుమారి జాతీయ రహదారి 44పై వరద నీరు ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ఇరువైపులా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అంతేగాకుండా కామారెడ్డి జిల్లా భిక్కనూరు - తలమడ్ల సెక్షన్, మెదక్ - అక్కన్నపేట సెక్షన్ లలో రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న పుసులేరు వాగు..
మెదక్ పట్టణ శివారు మంభోజిపల్లి శివారులోని పుసులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పట్టణ ప్రజలు వాగులో వరద నీటి ప్రవాహాన్ని చూడడానికి తరలివచ్చారు. ఈ వాగుపై గతంలో ఉన్న పాత బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి కొత్త బ్రిడ్జి అంచులదాకా నీరు ప్రవహించడం జరుగుతోంది. అంతేకాకుండా పట్టణంలోని గాంధీనగర్, ఆటోనగర్ కాలనీలలో వరద నీరు ప్రవహించి ఇండ్లలోకి, దుకాణాలలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో భారీ వర్షాలకు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించడంతో పట్టణంలోని ప్రధాన రహదారులపై రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
హెలిక్యాప్టర్ పంపించండి...
హవేళీఘణపూర్ మండలం దూప్‌సింగ్ తండా పూర్తిగా వరద నీటిలో చిక్కుకొని తండావాసులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో హెలిక్యాప్టర్ ద్వారా సహాయం అందించాలని మాజీ మంత్రి హరీష్‌రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వేర్వేరుగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ్మ, జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దూప్‌సింగ్ తండావాసులను తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్, ఎస్పీకి సూచించారు.