calender_icon.png 28 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వాన

28-08-2025 09:49:47 AM

    1. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు
    2. బిక్నూర్‌ దగ్గర కొట్టుకుపోయిన జాతీయ రహదారి..

    కామారెడ్డి,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న కుంభ వర్షం కామారెడ్డి జిల్లా(Kamareddy district) ప్రజలను అతలాకుతలం చేసింది. కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్ట్ గేట్లు ఎక్కడంటే సమీపంలో రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న 8 మంది కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకొని ట్యాంకర్ పై నిలబడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్ పోలీస్ బృందాలు చేరుకొని నీటిలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. జిల్లా ఎస్పీ రాజేష్  చంద్ర నీటిలో చిక్కుకున్న వారిని దగ్గరుండి ఒడ్డుకు చేర్చారు. లింగంపేట మండలం ఎల్లారం వద్ద కల్వర్ట్ కృంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఎస్ ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ కౌండిన్య ఎంక్లేవ్ లో ఉన్న వారి చుట్టూ నీరు చేరడంతో వారిని స్థానిక పోలీసులు తాళ్ల సహయంతో బయటకు తెచ్చారు. బిక్కు బిక్కు మంటూ ప్రజలు గడిపారు.

    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం చౌరస్తా సమీపంలో విద్యానగర్, నిజాంసాగర్ రోడ్ లో జీవధాన్ స్కూల్ వరకు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజ లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనంత వర్షం కురవడంతో కామారెడ్డి పెద్ద చెరువు భారీగా ప్రవహించడంతో కామారెడ్డి వాగు ఉద్రుతంగా ప్రవహించింది. దీంతో హౌసింగ్ బోర్డ్ పాత జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ ఎడ్ల కట్ట వాగు పొంగిపొర్లడంతో సంగమేశ్వర్ వెళ్లే ఇద్దరు కారులో ప్రవహానికి కొట్టుకపోయారు. స్థానికులు చూసి జెసిబి సాయంతో వారిని గడ్డకు చేర్చారు. ఎల్లారెడ్డి మండలంలోని నాగిరెడ్డిపేట్ గోపాల్పేట్ మధ్యలో వాగులు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

    జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలలో భారీ వర్షం కురవడంతో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. భిక్కనూర్ రామేశ్వర్ పల్లి శివారులో రైల్వే ట్రాక్ కింది నుంచి వరద నీరు ప్రవహించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తలమడ్ల, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో కరీంనగర్ కాచిగూడ రైలు నిలిపివేశారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో కామారెడ్డి జిల్లా కేంద్రం జలదిగ్బంధం అయింది.  మాచారెడ్డి మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే,జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి అప్రమత్తం చేశారు.

    రాజంపేట మండలంలోని కొండాపూర్ తండా, తో పాటు పలు తండాలు జలదిగ్బంధమయ్యాయి. లింగంపేట మండలంలోని కన్నాపూర్ పల్కంపేట చెరువు పెను ప్రమాదంలో పడింది. పలు చెరువులు, కుంటలు ప్రమాద స్థాయికి చేరాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, కళ్యాణి ప్రాజెక్ట్ లలోకి వరద నీరు భారీగా చేరడంతో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షిస్తూ పరిస్థితులపై ఆరా తీశారు. కామారెడ్డిలో గతంలో ఏ నడలేని విధంగా 14 గంటల్లో 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కంట్రోల్ రూమ్ కు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సేవలందిస్తున్నారు.

    గండ్లు పడ్డ రోడ్లు 

    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఎస్ ఆర్ కాలనీ సమీపంలో పాత ఏడవ జాతీయ రహదారి కల్వర్టు కృంగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని నాగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డి రహదారిపై కండ్లు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంసాగర్ నుండి ఎల్లారెడ్డి మధ్యలో బొగ్గు గుడిసె వద్ద రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాచారెడ్డి, సదాశివ నగర్, తాడువాయి, లింగంపేట్, గాంధారి, నాగిరెడ్డిపేట్, దోమకొండ, బిక్కనూర్ మండ లాలల్లో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు పొంగిపొర్లుతున్నాయి.