05-10-2025 07:16:00 PM
అప్రమత్తమమైన అధికారులు..
జిఆర్ కాలనీ వద్ద వాగు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్..
పట్టణ ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నెలరోజుల క్రితం భారీ వర్షం కురిసి అతలాకుతలమైన విషయం మరవకముందే ఆదివారం అదే ఐదో తేదీన మళ్లీ భారీ వర్షం దంచికొట్టింది. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. గత నెల రోజుల క్రితం అతలాకుతలమైన జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) ఆధ్వర్యంలో పరిశీలించి అలర్ట్ చేశారు. ఆయా కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్, రెవిన్యూ, పోలీస్ శాఖలను అప్రమత్తం చేసి బాధితులకు నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆదేశించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు కాలనీలు అయ్యప్ప నగర్, గాంధీనగర్, నిజాంసాగర్ రోడ్డు, స్టేషన్ రోడ్, జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, రాజనగర్ కాలనీ, దేవి విహార్ కాలనీలను అధికారులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కామారెడ్డి పెద్ద చెరువు భారీ వర్షానికి అలుగులు దుంకుతున్నాయి. చెరువులో గంగ పుత్రులు చేపలు పట్టకుండా ఉండాలని అధికారులు సూచించారు.
కామారెడ్డి పై ఉన్న రాజంపేట, తాడువాయి మండలాల్లో భారీ వర్షం కురవడంతో కామారెడ్డి పెద్ద చెరువులోకి భారీ వరద నీరు చేరుతుండడంతో జిఆర్ కాలనీ సమీపంలోని పెద్దవాగు ప్రవాహము పెరుగుతుండడంతో అధికారులు కాలనీవాసులను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కాలనీవాసులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, రాజంపేట, బిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై టేక్రియాల్ బైపాస్ వద్ద ఉన్న కల్వర్టు గత వర్షానికి ద్వంసం కావడంతో ఆదివారం మరింత వర్షం కురవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో సదాశివనగర్ వరకు ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్ పునరుద్దరించారు. భారీ వర్షం నెల రోజులకు కురవడంతో కామారెడ్డి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కుండపోత వర్షం గంట పాటు కురవడంతో మరో అరగంట పాటు వర్షం తగ్గుముఖం పట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.