06-12-2025 12:13:53 AM
- దారి ఖర్సులకు పైసలు పంపుతా..
- తప్పకుండా వచ్చి ఓటేయాలే..
-ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మతలబ్ చేస్తున్న అభ్యర్థులు
మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఫోన్ పే నెంబర్ పంపు..దారి ఖర్చులకు పైసలు పంపుతా.. తప్పకుండా వచ్చి నాకే ఓటు వేయాలి.. వచ్చినంక ఖర్చులకు కూడా అంతో ఇంతో ఇస్తా.. అంటూ దూరప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన వారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఫోన్ ద్వారా వేడుకుంటున్నారు.
పం చాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటు వేసే వారిని ఓటర్ల జాబితా నుంచి ఎంపిక చేసుకొని వారి యోగక్షేమాలను, స్థానికంగా ఉం టే ఇంటికి వెళ్లి, దూరంగా ఉంటే వారి ఫోన్ నెంబర్లు సేకరించి మచ్చిక చేసే పనిలో పడ్డా రు. ఒక్క ఓటు తేడాతో కూడా పరాజయం పాలయ్యే అవకాశాలు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఓటును వినియో గించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా రు.
దూరంగా ఉన్నవారికి రవాణా చార్జీలతోపాటు ఓటు వేయడానికి వచ్చిన తర్వాత అంతో ఇంతో నజరానాగా ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఓటు మాత్రం తప్పకుం డా తమకే వేయాలంటూ ‘మాట’ తీసుకుంటున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న ఇంట్లో వారిని ఇప్పటినుంచి ‘కాకా’ పట్టే పని చేపట్టారు. అన్న, వదిన, అక్క, బావ, చెల్లి, తమ్ముడు, తాత, అమ్మ అంటూ వరుసలు కలుపుతూ తమకు కేటాయించిన గుర్తులతో తెల్లవారిందే మొదలు ఇంటిముందు ప్రత్యక్షమవు తూ చెవిలో జోరీగ మాదిరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానికంగా ఉండే వారితో ఇలా ఉంటే.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడంతో పాటు ఓటు వేయడం మరవద్దంటూ వేడుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమకు గెలుపుకు అవసరమైన ఓట్లను, అనుకూలంగా ఉన్న వారి సంఖ్యతో సరిచూసుకొని, ఆ మేరకు ముందుగా వారికి ఏది కోరితే అది ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుండే అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు.
గంప గుత్తగా ఓట్లు వేయించడానికి ప్రయత్నాలు?
పంచాయతీ ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తుండగా, కొందరు వీధి పెద్దలు, ఎక్కువ సంఖ్య లో ఓట్లున్న కొందరిని బతిమిలాడుకుంటున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దు అంటూ అన్ని ఓట్లు తమకే వేసి గెలిపిస్తే ఐదేళ్లపాటు మీకు సేవ చేస్తామంటూ ఒట్లు పెట్టుకుంటున్నారు.
ఒక్క ఓటు నాకే వెయ్యాలి.. మరో ఓటు మీ ఇష్టం..!
ఒక్క ఓటు మాత్రం నాకు కచ్చితంగా వేయాలి.. మరో ఓటు మీకు ఇష్టం ఉన్నవారికి వేయండి అంటూ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎవరికి వారు ఓటర్లను వేడుకుంటున్నారు. సర్పంచు తమ ప్యానెల్ అభ్యర్థి కి కాకుండా ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే ఓటర్ల వద్దకు వెళ్లిన సమయంలో వార్డు సభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వండి, సర్పంచ్ గా మీ ఇష్టం ఉన్నవారికి వేసుకొని అంటూ ఎవరికి వారు గెలుపు కోసం ప్రచారం చేసుకుంటున్నారు.
గ్రామాల్లో అత్యధికంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యుల ప్యానెల్ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. అయితే పొద్దంతా ప్యానెల్తో ప్రచారం నిర్వహిస్తూ, రాత్రిపూట మాత్రం ఎవరికి వారు వ్యక్తిగతంగా కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు.