calender_icon.png 20 December, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బన్నీతో స్టెప్పులు!

20-12-2025 02:08:35 AM

అందం, అభినయంతో ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకుల మనసు గెలిచిన కథానాయకి మృణాల్ ఠాకూర్. బ్లాక్‌బస్టర్ ‘సీతారామం’తో తొలిసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ డెబ్యూ మూవీతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  ఆమె నటించిన రెండో సినిమా ‘హాయ్ నాన్న’ కూడా హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ స్టార్’తో హ్యాట్రిక్ అందుకుంటుందనుకున్న అభిమానుల అంచనాలు బాక్సాఫీస్ వద్ద తారుమారయ్యాయి. ఇప్పటివరకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపించిన మృణాల్ డాన్స్ చేస్తుంటే చూడాలన్న అభిమానుల మనసులో ఉన్న ప్రశ్న ఇటీవల ఆమెకు ఎదురైంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’లో మృణాల్ హీరోయిన్.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది.  ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ‘సినిమాలో డ్యాన్స్ చేస్తూ ఉల్లాసంగా ఉండే మృణాల్ ఠాకూర్‌ను ప్రేక్షకులు ఎప్పుడు చూడొచ్చు?’ అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. ‘వచ్చే ఏడాది అదే జరుగుతుంది’ అంటూ మృణాల్ చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ సరసన మృణాల్ నటిస్తోందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో దీపిక పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా నటిస్తోంది.

మరికొంత మంది బ్యూటీలు ఇప్పటికే ప్రాజెక్టులో భాగమయ్యారు. అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరనే విషయం అధికారికంగా మేకర్స్ ప్రకటించకున్నా మృణాల్ షూటింగ్‌లో పాల్గొంటోందంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా డాన్స్ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ తర్వాత బన్నీ, అట్లీ ప్రాజెక్టులో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోందనే వార్తలకు బలం చేకూర్చినట్టు అయింది. ఈ సినిమాలో మృణాల్‌కు సంబంధించిన డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని, అందుకోసం ఇప్పుడు రిహార్సల్స్‌లో పాల్గొంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి మృణాల్ ఏ రోల్‌లో కనిపించనుందో.. ఎలాంటి స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!