18-05-2025 12:00:00 AM
మనిషి పుట్టుక నుంచి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. ‘జీవితంలో ఏదో సాధించాలంటూ పరుగులు పెడుతున్నాం. ఎంత ఎక్కువ అచీవ్ చేస్తే అంత గొప్ప కాదు, అవసరమైనప్పుడు బ్రేక్ తీసుకోవడం అవసరం. విపరీతమైన ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఉన్నది చిన్న జీవితం. చిన్న చిన్న ఆనందాలను పోగేసుకుంటూ.. నా ప్రయాణాన్ని ఇన్‌స్టాలో వీడియోలుగా పోస్ట్ చేయడం మొదలు పెట్టాను’ అంటున్నారు పూజా వెగేశ్న వురఫ్ మహాలక్ష్మి.. ఆమె స్లో లివింగ్ లైఫ్ గురించి పరిచయం..
మహాలక్ష్మి మా తాతగారి అమ్మపేరు. ఆవిడ చనిపోయిన మూడు రోజులకు నేను పుట్టానని మా ఇంట్లో నన్ను అదే పేరుతో పిలుస్తారు. మాది లక్కవరం. పెరిగిందంతా హైదరాబాద్. అమ్మ గీతావాణి. నాన్న ఈశ్వరరాజు కన్‌స్ట్రక్షన్ పీల్డ్‌లో ఉన్నారు.
నచ్చిన రంగమే కానీ..
విదేశాల్లో సైకాలజీ చదివి.. అక్కడే ఉద్యోగంలో చేరా. నచ్చిన రంగమే. కానీ వేళకాని వేళలు, విపరీతమైన ఒత్తిడి. అలాగని ఉద్యోగాన్ని వదల్లేను. తొలిరోజుల్లో అలాగే అనిపిస్తుంది. కొన్నిరోజులకు సర్దుకుంటుంది. ఫ్యూచర్ బాగుండాలంటే తప్పదనుకుంటూ కొనసాగించా. కానీ మన అనారోగ్యాలకి 70శాతం ఒత్తిడే కారణం.
నాకు విపరీతమైన యాక్నే వచ్చింది. అద్దంలో ముఖం చూసుకోవడానికి కూడా భయపడ్డా. దానికితోడు పీసీఓడీ, బరువు పెరిగా. ఏం తిన్నా పడేది కాదు. ఒకలాంటి డిప్రెషన్ ఆవరించింది. లేవడం, ఆఫీసుకు వెళ్లడం, రావడం, పడుకోవడం.. ఇదేనా నా జీవితం అనిపించేది. నా రిసెర్చ్ ఒత్తిడి మీదే.. అందుకే మనసు బాలేనప్పుడు డబ్బులొచ్చి లాభమేంటని వదిలేసి ఇండియాకు వచ్చా.
బ్రేక్ అవసరం..
ఇండియాకు వచ్చాక ఏం చేస్తే ఆనందంగా ఉంటానని ఆలోచించా. దానికి సమాధానం వెతుకుతూ కాశీ, కేదార్‌నాథ్, రుషీకేష్.. వంటివెన్నో తిరిగా.. ఏం చేసినా రాని ఆనందం చిన్నచిన్న వాటిల్లో, నన్ను నేను తెలుసుకోవడంలో కనిపించింది. అప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి లక్కవరం వెళ్లా.. నిజానికి చదువుకునేటప్పుడు తరచూ అక్కడకు వెళ్లేదాన్ని. స్నేహితులను తీసుకెళితే అబ్బా ఎంత బాగుందీ ప్రదేశం.
సోషల్‌మీడియాలో వీటిని పరిచయం చేయొచ్చు కదా అనేవారు. అప్పుడవేమీ పట్టించుకునేదాన్ని కాదు. ఫోన్ పట్టుకుని కూర్చునేదాన్ని. అప్పుడే నాకు నచ్చిన కాఫీ, వర్షపు చినుకుల ప్రభావం నాపై పడ్డది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ స్లో లివింగ్ లైఫ్ మొదలు పెట్టా.
ప్రతి క్షణాన్నీ ఆస్వాదించడమే స్లో లివింగ్. పనితోనే జీవించేస్తున్నాం. ఏదో సాధించాలంటూ పరుగులు పెడుతున్నాం. ఎంత ఎక్కువ అచీవ్ చేస్తే అంత గొప్ప కాదు. అవసరమైనప్పుడు బ్రేక్ తీసుకోవడం తప్పుకాదు. నా వీడియోల ద్వారా ఒక్కరు బయటపడ్డా చాలని నా ప్రయాణాన్ని ఇన్‌స్టాలో వీడియోలుగా పోస్ట్ చేయడం మొదలు పెట్టా.
నచ్చిన మార్గంలో..
నా తొలి వీడియో.. 10-12 సెకన్లు ఉంటుంది. లేచి మెట్లుదిగితూ వచ్చి దేవుడికి దండం పెట్టుకుని అమ్మమ్మకు హగ్ ఇచ్చేది. అది బాగా వైరలైంది. రోజు అలాంటివే చిన్న చిన్న ఆనందాల్ని పంచుకోవడం మొదలుపెట్టా. పది రోజుల్లోనే లక్షమంది ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం 5.3 లక్షలమంది అనుసరిస్తున్నారు. ఓవైపు ఆన్‌లైన్ సెషన్లు తీసుకుంటూనే ఇవీ కొనసాగిస్తున్నా.
నేను యూత్ ఐడెంటిటీ డెవలప్‌మెంట్‌లో మేజర్‌తో పాటు కాగ్నిటివ్ సైకాలజీలో సర్టిఫికేషన్‌నీ చేశా. 18-45 ఏళ్లవారికి కౌన్సెలింగ్ చేస్తా. రెండింటికీ సమయం కేటాయించడం కష్టమ వుతున్నది. సైకాలజీ, యోగా, ధ్యానంతో స్లో లివంగ్ వర్క్‌షాప్‌లు ప్లాన్ చేస్తున్నా. దీన్నో థెరపీలా పరిచయం చేయబోతున్నా. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే సమయం వృథా చేస్తున్నావ్? ఇంత చదివి ఏంటిలా.. ఇలా ఎన్నో ప్రశ్నలు.. అవి విన్నప్పుడు నిజంగానే తప్పు చేస్తున్నాం అనుకుంటాం.
అందుకే నచ్చని మార్గంలోకి వెళతాం. ఎవరో చెప్పిన జీవితాన్ని ఎంచుకుంటాం. తీరా కొన్నాళ్లయ్యాక నేను కోరుకున్న ఆనందం ఇది కాదు.. అప్పుడే చెప్పేయాల్సింది అనిపిస్తుంది. అప్పుడిక కొనసాగించక తప్పని పరిస్థితి. అందుకే వయసులో ఉన్నప్పుడే నచ్చిన దారి ఎంచుకోవాలి. బాధ్యతలుంటే వాటిని నిర్వర్తిస్తూనే ఆనందాన్ని పొందడం నేర్చుకోవాలి.
నేను చేస్తున్నది అదే. చివరిసారి ఎప్పుడు బాగా ఎంజాయ్ చేశారు? అంటే గత ఏడాది బయటికి వెళ్లినప్పుడు.. ఆ ఫంక్షన్లులో కాకుండా.. ఈ క్షణం.. ఇందాక అంటూ చెప్పేలా తయారు కావాలని నా అభిప్రాయం.
చిన్నచిన్న ఆనందాలే..
జీవితంలో చిన్నచిన్న ఆనందాలు పోగేసుకోవడం నాకు అలవాటైంది. అవే మధురమైన క్షణాలు కూడా. చివరిసారి ఎప్పుడు బాగా ఎంజాయ్ చేశారు? అంటే గత ఏడాది బయటికి వెళ్లినప్పుడు.. ఆ ఫంక్షన్‌లో కాకుండా.. ఈ క్షణం.. ఇందాక అంటూ చెప్పేలా తయారు కావాలని నా అభిప్రాయం.
- మహాలక్ష్మి