calender_icon.png 11 July, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ బుడతలు.. కోటీశ్వరులు!

18-05-2025 12:00:00 AM

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు యూట్యూబ్ పెద్ద కాలక్షేపం. అందులో కొత్తకొత్త టాయ్ రివ్యూల దగ్గర నుంచి అనేక సరదా కార్యక్రమాల వరకూ.. అన్నీ వచ్చేస్తుంటాయి. అయితే ఇదే ట్రెండ్ మరికొందరు పిల్లలకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నది. వయసుకు మించి సంపాదనకు అద్భుత మార్గంగా నిలిచింది. సాంకేతికత, సృజనాత్మకతను అందిపుచ్చుకున్న పెద్దలు.. వారి పిల్లలు ఇప్పుడీ యూట్యూబ్ వీడియోలు సృష్టించే పనిలో తెగ బిజీ అయ్యారు. ఇప్పటికే అనేక ఛానెళ్లతో పాపులారిటీ సంపాదించి.. కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. 

యూట్యూబ్‌తో బుడతలకు ఎక్కడలేని స్టార్‌డమ్ వచ్చేసింది. సెలబ్రిటీ అనే పదానికి అర్థం తెలియని చిన్న వయసులోనే యూట్యూబ్ స్టార్లుగా మారిపోయారు. వారిలో కొందరి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కేవలం యూట్యూబ్ ద్వారా కోట్లలో వార్షికాదాయాన్ని పొందుతూ బుల్లి బిలియనీర్లుగా మారిన చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. చురుకైన వారి హావభావాలు.. కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడే తత్వం.. సందర్భోచిత హాస్యం.. ఈ లక్షణాలే వారి విజయానికి పునాదులుగా మారాయి. వాటిపై తమ యూట్యూబ్ ప్రపంచాన్ని సృష్టించుకున్న బుడతలు వీరంతా.. 

మై మిస్ ఆనంద్ 

పదకొండేళ్ల అనంత్యాకు నాలుగేళ్లకే యూట్యూబ్ పరిచయం అయింది. తన బంధువు శ్రుతి ఖాళీ సమయంలో చిన్న చిన్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. ఒకసారి అనంత్యాపై కూడా సరదాగా వీడియో తీసి పోస్టు చేసింది. అలా కొన్ని వీడియోలలో శ్రుతితో కలిసి కనిపించింది అనంత్యా. ఈ చిన్నారిలో నటించే ప్రతిభ ఉందని.. అది యూట్యూబ్‌కు పనికొస్తుందనిపించింది శ్రుతికి.

ఆమె కోసం ‘మై మిస్ ఆనంద్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది. అది కేవలం అనంత్యా కోసమే. ఈ ఛానెల్‌ను అనంత్యా తన స్వశక్తితో ముందుకు తీసుకెళ్తున్నది. అందరి పిల్లల్లాగే స్కూలుకి వెళుతుంది. శనివారం షూటింగ్‌కు హాజరవుతుంది. ఆదివారం ఆడుకోవడం తప్ప ఏ పని పెట్టుకోదు. వారానికి ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తుంది. స్క్రిప్ట్ వర్క్, ఎడిటింగ్ అన్నీ తల్లే చూసుకుంటుంది.

ఒక వీడియోకు సంబంధించిన షూటింగ్ ఎనిమిది గంటల్లో పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఆమె ఛానెల్‌కు కోటి పది లక్షల మందికి పైగానే సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఇప్పటికే సిల్వర్, గోల్డెన్, డైమండ్ బటన్లను కూడా యూట్యూబ్ నుంచి అందుకుంది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు లక్షల రూపాయలను సంపాదిస్తుంది. 

లైక్ నాస్త్యా

ఈ పాప అసలు పేరు అనస్తీషియా. చాలా వెరైటీ పేరు కదా. కానీ యూట్యూబ్ ప్రపంచానికి మాత్రం నాస్త్యాగానే పరిచయం. కొన్ని దేశాల్లో ముద్దుగా స్టేసీ అని పిలుస్తారు. పుట్టినప్పుడు వైద్యులు అనస్తీషియాకు సెరెబ్రల్ పాల్సీ ఉందని చెప్పారు. తల్లిదండ్రులు చిన్నప్పట్నించి ఆ వ్యాధికి చికిత్స చేయిస్తున్నారు. ఆ వైద్యం తాలూకు వివరాలను, ఆమె రోజువారీ జీవితాన్ని వీడియోలుగా చిత్రీకరించేవారు.

అలా ఆ చిన్నారికి కెమెరా అలవాటైంది. ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవారు. అవి చాలా మందికి నచ్చాయి. దాంతో ‘లైక్ నాస్త్యా’ పేరుతో కొత్త ఛానెల్ ప్రారంభించారు. ఈ ఛానెల్‌కు ఇప్పుడు ఏడు కోట్ల మంది సబ్ స్ర్కైబర్లున్నారు. అనస్తీషియా తల్లిదండ్రులు ఉద్యోగాలను వదులుకుని పూర్తి స్థాయిలో యూట్యూబ్ వీడియోలే చేస్తున్నారు. అనస్తీషియా పేరుతో దాదాపు ఆరేడు ఛానెళ్లు ఉన్నాయి.

అమ్మాయి వీడియోలను చూస్తే ఆమె ‘సెరెబ్రల్ పాల్సీ’తో బాధపడుతున్న చిన్నారిలా అనిపించదు. యూట్యూబ్ క్రియేటర్లలో అతి వేగంగా ఎదుగుతున్న యూట్యూబర్‌గా అనస్తీషియాను గుర్తించింది ‘ఫోర్బ్స్’ పత్రిక. యూట్యూబ్ ద్వారా ఈ చిన్నారి ఏడాదికి దాదాపు 18 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్టు అంచనా. అంటే మన రూపాయల్లో రూ.131 కోట్లన్న మాట. అనస్తీసియాది రష్యా. యూట్యూబ్‌లో విజయం వరించాక వారు అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. 

సమ్రీన్ అలీ..

సమ్రీన్ పెట్టి పెరిగిందంతా డిల్లీయే. యూట్యూబ్ మీద ఆసక్తితో తన పేరు మీదే ఖాతా తెరిచింది. మొదటి వీడియో అప్‌లోడ్ చేసినా పెద్దగా ఎవరూ చూడలేదు. రెండో వీడియో మాత్రం కొన్ని వేలమంది తిలకించడంతో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి అదో అలవాటుగా మార్చుకుంది. తరచూ వీడియోలు చేయకపోయినా వారానికో, నెలకో ఒక వీడియో అప్‌లోడ్ చేసేది. ఆమె చేసిన వీడియోలన్నీ కామెడీ స్కిట్లే.

కాసేపు నవ్వుకునేట్లు ఉంటాయి. నటన మీద ఆసక్తి ఉండటంతో యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ప్రతిభను ప్రపంచానికి చూపించడం మొదలుపెట్టింది. కొన్ని నెలలకు సబ్‌స్ర్కైబర్లు లక్ష దాటడంతో ఆమెకు మరింత ఆసక్తి పెరిగింది. తరచూ వీడియోలు అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం సమ్రీన్ అలీ యూట్యూబ్ ఛానెల్‌కు 33 లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

ఆమె అప్‌లోడ్ చేసిన ఒక వీడియో ‘ద ఇండియన్ సాంతా’ అనే వీడియోను రెండు కోట్లమందికి పైగా వీక్షించారు. యూట్యూబ్ ద్వారా సమ్రీన్ నెలకు ఎనిమిది లక్షల రూపాయల నుంచి ముప్పు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇంత చిన్న వయసులో కోటీశ్వరురాలు అయింది. 

పేరెంట్స్‌కు సూచనలు

* యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించేది, నడిపేది పిల్లలే అయినా పర్యవేక్షణ మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉండాలి.

* యూట్యూబ్ నియమం ప్రకారం పదమూడేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఛానెల్ క్రియేట్ చేయడానికి అర్హులు కారు. కనుక తక్కువ వయసున్న పిల్లల కోసం తల్లిదండ్రులు తమ మెయిల్ ఐడీతోనే ఛానెల్ ప్రారంభించాలి.

* ఛానెల్ హిట్ అయినా, అవ్వకపోయినా పూర్తి బాధ్యతను పిల్లల మీద వదిలి పెట్టవద్దు. మీ నియంత్రణలోనే పిల్లలు వీడియోలు అప్‌లోడ్ చేయడం వంటివి చేసేలా చూసుకోవాలి.

* కామెంట్ సెక్షన్‌పై పర్యవేక్షణ చాలా అవసరం. ట్రోలింగ్, బుల్లీయింగ్ వంటివి పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తాయి. అవసరం లేదనుకుంటే ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయకుండా ఆ సెక్షన్‌ను క్లోజ్ చేయాలి.

* యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల గురించి వారి దగ్గర ఎక్కువగా ప్రస్తావించవద్దు. అది కేవలం సరదా వ్యాపకంగానే పరిగణించేట్టు చూసుకోవాలి. 

* యూట్యూబ్ ఛానెల్ పెట్టాక మీ పిల్లాడిలో వస్తున్న మార్పులు మాత్రం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలి. అవి కచ్చితంగా సానుకూలమైనవి అయితేనే ఛానెల్‌ను కొనసాగించాలి.