calender_icon.png 12 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకో దీవి..

18-05-2025 12:00:00 AM

అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్టినా రోత్.. మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సృష్టించాలనుకుంది. అందులో భాగంగా ఫిన్లాండ్ తీరంలో ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి దానికి ‘సూపర్ షీ ఐలాండ్’ అని పేరు పెట్టింది. అక్కడ మహిళల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఒక రిసార్టు ఏర్పాటు చేసింది. 2018 నుంచి అది అందరికీ అందుబాటులోకి వచ్చింది.

సముద్రం మధ్యలో.. ప్రశాంతమైన వాతావరణంలో.. ప్రకృతితో మమేక మవ్వాలనుకునేవారికి ఇది నిజంగా స్వర్గధామం అంటున్నారు. ప్రపంచానికి.. ముఖ్యంగా మగవారికి దూరంగా నచ్చినట్లుగా, స్వేచ్ఛగా గడపాలనుకునే మహిళలు అక్కడికి వెళ్తున్నారు. వారంతా మనసు విప్పి స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ.. ఆలోచనల్ని పంచుకుంటూ.. అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపు తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారట. 

కుకింగ్ నుంచి డ్రైవింగ్‌లో శిక్షణ వరకు.. అన్ని కార్యకలాపాలు మహిళలే నిర్వహిస్తారు. అతిథులను హార్బర్‌కు తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు, కూరగాయలు సరఫరా చేసే మహిళా రైతులు, ఫొటో గ్రాఫర్లు.. ఇలా దీవి మొత్తం మహిళలే కనిపిస్తారు. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు భారీ క్యాబిన్లు, మూడు మినీ క్యాబీన్లు ఉన్నాయి.

వీటిని స్కాండినేవియర్ శైలిలో పర్యావరణహితంగా నిర్మించడం విశేషం. ఒక క్యాబిన్‌లోని షేరింగ్ గదిలో ఐదు రోజుల వసతికి మూడు వేల నుంచి ఐదు వేల డాలర్లు ఖర్చు అవుతాయి. అంటే మన కరెన్సీలో సుమారు రెండున్నరలక్షల నుంచి ఐదు లక్షల రూపాయలన్నమాట. కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా మన దగ్గరి నుంచి సంపన్న మహిళలు వెళ్తున్నారు. 

నోరూరించే రుచులు..

నోరూరించే అన్ని రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు స్వయంగా వంట చేసుకోవాలనుకున్నా అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సహజసిద్ధంగా లభించే కూరగాయలే వంటకు ఉపయోగిస్తారు. ఆల్కహాల్ పూర్తిగా నిషేధం. ఈ ఎకోహా దీవిలో సౌరశక్తితో నడిచే టాయిలెట్లను వినియోగిస్తున్నారు. ఈ ద్వీపంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే స్త్రీలను అనుమతిస్తారు.

ఈ దీవిని సందర్శించాలనుకుంటే.. ముందుగా ఆసక్తిగల మహిళలు ‘సూపర్ షీ ఆర్గనైజేషన్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఫారమ్‌లో ‘ఈ ద్వీపాన్ని ఎందుకు సందర్శించాలనుకుంటున్నారు? ఒంటరిగా గడపడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు నింపాల్సి ఉంటుంది. ఆపై దరఖాస్తుదారుల్ని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి.. కొంతమందికి మాత్రమే దీవిని సందర్శించడానికి అనుమతిస్తారు. 

సముద్రతీరంలో.. 

సముద్రతీరంలో ఇసుక తిన్నెల మీద పర్యాటకులకు ప్రతిరోజు యోగా సెషన్ నిర్వహిస్తారు. ఆపై ధ్యానం, ఫిట్‌నెస్, కుకరీ తరగతులు, ప్రకృతి పరిరక్షణ వంటి అనే వెల్‌నెస్ కార్యక్రమాలుంటాయి. కాస్త విశ్రాంతి కోరుకునేవారికి కోసం స్పా, సౌనా బాత్, ఫేషియల్స్, ఫారెస్ట్ బాత్ వంటి అనేక రకాల సౌకర్యాలున్నాయి. సాహస క్రీడల్లో కూడా పాల్గొనవచ్చు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ నుంచి సుమారు 160 కి.మీ దూరంలో.. బాల్టిక్ సముద్రంలో ఈ దీవి 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హెల్సింకీ నుంచి బోటు లేదా హెలికాప్టర్‌లో తీసుకెళ్తారు.