12-10-2025 01:11:37 AM
న్యూఢిల్లీ, అక్టోబర్‌౧౧: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో రెండోరోజు కెప్టెన్ శుభమన్‌గిల్ (129 నాటౌట్, 22 ఫోర్లు) శతక్కొడితే... జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. నితీష్ రెడ్డి, జురెల్ కూడా రాణించడంతో భారత్ భారీస్కోరు చేసింది. తర్వాత జడేజా తిప్పేయడంతో విండీస్ తడబడుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 318/2తో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ కాసేపటికే జైస్వాల్ వికెట్ కోల్పోయింది.
అనవసర పరుగు కోసం ప్రయ త్నించిన ఈ యువ ఓపెనర్ 175 పరుగులకు ఔటై డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక్కడ నుంచి గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి కీలక భాగస్వా మ్యం నెలకొల్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కడంతో ఐదోస్థానంలో వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడాడు. వేగంగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో 54 బంతుల్లో 43 (4 ఫోర్లు,2 సిక్స ర్లు) రన్స్‌కు ఔటయ్యాడు.
గిల్, నితీశ్ మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. లంచ్ తర్వా త కెప్టెన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 177 బంతుల్లో గిల్ శతకాన్ని సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఎలా ఆడాలో చూపిస్తూ ఓపిక ను ప్రదర్శించాడు. లూజ్ బాల్స్‌ను బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. టెస్టుల్లో గిల్‌కు ఇది పదో సెంచరీ.. కెప్టెన్‌గా ఐదో శతకం. సారథిగా భారత గడ్డపై మొదటిది.
అటు జురెల్ కూడా సపోర్ట్ చేయడంతో భారత్ చూస్తుండగానే స్కోర్ 500 దాటింది. జురెల్ హాఫ్ సెంచరీకి చేరువలో ఔటవడంతో గిల్ 518 పరుగుల దగ్గర భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. గిల్ జోడీ 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు, ఛేజ్ ఒక వికెట్ పడగొట్టారు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ త్వరగానే క్యాంప్‌బెల్ వికెట్ కోల్పోయింది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో జడేజా తన మ్యాజిక్ చూపించాడు. క్యాంప్‌బెల్ ఔటైనా..అథనాజే,చంద్రపాల్ పట్టుదల ప్రదర్శించారు. వీరిద్దరూ 66 రన్స్ జోడించడంతో విండీస్ 87/1 స్కోర్‌తో పటిష్టస్థితిలో నిలిచింది.
అయితే జడేజా చంద్రపాల్(34) ను ఔట్ చేసి మరోసారి విండీస్‌కు షాకిచ్చాడు. అథనాజే(41)ను కుల్దీప్ ఔట్ చేయగా.. తర్వాత ఛేజ్‌ను జడేజా డకౌట్‌గా వెనక్కి పంపాడు. చివర్లో హోప్(31),టెవిన్(14) మరో వికెట్ పడకుండా జాగ్రతగా ఆడడంతో విండీస్ 140/4 స్కోరుతో రెండోరోజును ముగించింది. విండీస్ ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉండగా.. మూడోరోజు తొలి సెషన్ కీలకం కానుంది.
స్కోర్లు :
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్ (జైస్వాల్ 175,గిల్ 129, సాయి 87,జురెల్ 44,నితీశ్ 43; వారికన్ 3/98)
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్:140/4 (క్యాంప్‌బెల్ 10,చంద్రపాల్ 34, అథనాజే 41,ఛేజ్ 0, హోప్ 31 బ్యాటింగ్, టెవిన్ 14 బ్యాటింగ్; జడేజా 3/37)