15-07-2025 06:09:33 PM
క్రమశిక్షణ, సైబర్ భద్రతపై అవగాహన
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు మంగళవారం హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, షీటీమ్ బృందం సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సదస్సులో విద్యార్థులకు క్రమశిక్షణ, సైబర్ నేరాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గంజాయి-ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలు, ఈవ్‌టీజింగ్, నూతన చట్టాలపై వివరణాత్మక సమాచారం అందించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా కృషి చేయాలని, జీవితాన్ని మార్చగల శక్తి చదువుకు మాత్రమే ఉందని నొక్కి చెప్పారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అవి జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోయి జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. ఈ అవగాహన సదస్సులో సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు పనిచేసే చోట వేధింపులు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాలపై వివరించారు.
అంతేకాకుండా, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నియమాలు, సైబర్ నేరాలు, సైబర్ బెదిరింపులు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తీరు వంటి అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏదైనా వేధింపులకు గురైనప్పుడు లేదా అవహేళన చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా వెంటనే డయల్ 100కు లేదా సిద్దిపేట షీటీమ్ నంబర్ 8712667434కు కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ లక్ష్మారెడ్డి సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.