25-07-2024 02:03:06 AM
బీజేపీ ఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు మానుకోవాలని బీజే పీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సూచించారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అన్నారు. వెంటనే ఈతీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌కు ముందు కేంద్రం.. తెలంగాణకు ఎన్నో సందర్భాల్లో నిధులు ఇచ్చిందని.. వాటిపై అసెంబ్లీలో చెప్పకుండా ఒక బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదన్నారు.
గతంలో రోడ్ల అభివృద్ధ్దికి నిధులు కేటాయిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోడీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించిన మాట నిజం కాదా అన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తేదార్లతో చేతులు కలిపిందని విమర్శించారు. ఇప్పటివరకు మూసీపై డీపీఆర్‌లు ఇవ్వకుండా నిధులు ఏవిధంగా కేటా యిస్తారని నిలదీశారు. అమృత్ పథకానికి కేంద్రం రూ.3,500 కోట్లు కేటాయించిందని వాటిని ఎక్కడ వినియోగించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలపై ఎప్పడూ వివక్ష చూపదని అన్నారు. అవగాహన లేకపోవడంతోనే కాంగ్రెస్ సభ్యులు సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.