calender_icon.png 17 October, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పు బిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు.!

17-10-2025 03:00:43 PM

  1. స్పెషల్ జిఓ ద్వారా దళితులకు న్యాయం చేయాలి.
  2. మెడికల్ కళాశాల భూ నిర్వశితులకు పరిహారం ఇవ్వాలి. 
  3. ఇతరుల భూముల ధరలు పెంచుకునేందుకు దళితులను బలి చేశారు. 
  4. వైకుంఠ ధమాలు, రైతు వేదికల పేర 44వేల ఎకరాలు బలవంతంగా గుంజుకున్నారు. 
  5. సీనియర్ హై కోర్టు అడ్వాకెట్ రామేశ్వర్ రావు.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల భూ నిర్వాసితుల పక్షాన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి(BRS party) చెంపపెట్టు లాంటిదని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష నేతల మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలు దోపిడీలు నిరంకుశత్వంగా దలితులను అడుగడుగునా అవమానపరిచిందని గ్రామాల్లోని వైకుంఠ ధమాలు, చెత్త సేకరణ కేంద్రాలు, రైతు వేదికల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ఎకరాలను అతి కిరాతకంగా బలవంతంగా లాక్కుందన్నారు. నిరుపేద దళితుల ఉసురు ముట్టి ఘోరంగా ఓటమి చెందారని ఆరోపించారు.

సీలింగ్ భూములు పట్టా భూములతో సమానమేనని 1890 బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు 2004లోనూ ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాఫియాగా ఏర్పడి నిబంధనలను అతిక్రమిస్తూ వారి భూముల ధరలకు రెక్కలొచ్చేలా ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టు నిర్మాణాలకు దళితుల భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కనీసం కూలినాలి చేసుకొని బ్రతకడమే కష్టంగా ఉన్న దళితుల నుండి ఫామ్-6 ద్వారా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినట్లుగా హైకోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం కోసం సర్వేనెంబర్ 237లొ సుమారు 44 ఎకరాలను సేకరించారని ఇందులో 23 మంది నిరుపేద దళిత రైతులే ఉన్నారని వారందరికీ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరట కలిగిస్తుందన్నారు. నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ జీవో ద్వారా ఆ దళిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారితోపాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్, భూ నిర్వాసితుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధారాసత్యం, ప్రధాన కార్యదర్శి దేశపాగ శ్రీనివాస్, సిపిఐ నేతలు శివకుమార్, సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ, రాష్ట్ర బిఎస్పి మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్చార్జ్ కళ్యాణ్, మాల మహానాడు నాయకులు సత్యం, బిజెపి నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.