07-01-2026 12:10:31 AM
అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చిన అంశం
కల్వకుర్తి జనవరి 6 : కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసాల మీదుగా విద్యుత్ హైటెన్షన్ వైర్లు వెళ్లడం పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లకు అతి సమీపంగా ఉన్న ఈ తీగల వల్ల వర్షాకాలంలో ఈదురు గాలులు వీస్తే నిప్పు రవ్వలు పడటం, తీగలు తెగిపోయే ప్రమాదం ఏర్పడుతుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 20ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించాలని విద్యానగర్ వాసులు సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల కల్వకుర్తి పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాలనీవాసులు ప్రత్యేక వినతి పత్రాలు అందజేసి సమస్య తీవ్రతను వివరించారు.
మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నివాసాల మీదుగా ఉన్న హైటెన్షన్ తీగలను తొలగించి ప్రజలకు భద్రత కల్పించాలని విద్యానగర్ కాలనీవాసులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.