01-08-2025 12:00:00 AM
గంభీరావుపేట తంగళ్లపల్లి జూలై 31(విజయక్రాంతి): విద్య ద్వారా మాత్రమే ఉన్నత లక్ష్యాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం ఆయన తంగళ్లపల్లి మండలంలోని దమ్మన్నపేట, గంభీరావుపేట మండలంలోని మండేపల్లి గ్రామాల్లో తెలం గాణ మోడల్ స్కూల్లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఆన్లైన్ తరగతుల ద్వారా నిపుణుల శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపా రు. ఢిల్లీ వంటి నగరాల్లో లభించే కోచింగ్ను ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు కూడా సాంకేతికత ద్వారా అందిస్తున్నామన్నారు.ప్రతి విద్యార్థి రోజుకు కనీసం రెండు గంటల పాటు త రగతులు వినాలని సూచించారు.
10వ తరగతి నుండి ఇంటర్ వరకు కాలం విద్యార్థి జీవితంలో కీలకమైందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చన్నారు. ముఖ్యమైన పాఠ్యాంశాలైన కాలిక్యులస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో మ్యాగ్నెటిజం మొదలైన వాటిని బేసిక్స్ తో సహా బలంగా నేర్చుకోవాలన్నారు. తరగతుల సమయంలో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పేదల విద్య కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు.
జిల్లాలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కల్పించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ జయంత్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.