02-08-2025 04:40:36 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే..
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): నేర ఘటన కేసుల విచారణలో పోలీసు జాగిలాల సేవలు కీలకమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే(District SP Kiran Khare) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు జాగిలాల కోసం ఏర్పాటుచేసిన నూతన గదులను ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జాగిలాలు ఎస్పీకి గౌరవ వందనం తెలిపాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో పోలీసు జాగిలాల సౌకర్యార్థం నూతనంగా నాలుగు గదులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను కనుక్కోవడం, హత్య కేసులను, దొంగతనాల్లో దొంగలను పసిగట్టడం వివిధ కేసుల విచారణలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో అవసరం అన్నారు. జాగిలాలకు ప్రతిరోజు వ్యాయామం చేయించడంతో పాటు, మెనూ ప్రకారం ఆహారం అందిస్తూ ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్, డిఎస్పిలు సంపత్ రావు, నారాయణ నాయక్, ఇన్స్పెక్టర్లు నరేష్, నగేష్,కిరణ్, రత్నం, నరేష్, రమేష్ , వెంకటేశ్వర్లు, డాగ్ హ్యాండ్లర్స్ తిరుపతి, శ్రీధర్ పాల్గొన్నారు.