02-08-2025 04:27:20 PM
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం మంత్రులు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Rao) పర్యటించి, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 72 శాతం కుటుంబాలు ఉచిత కరెంటు పొందుతున్నాయని, కొల్లాపూర్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందన్నారు. అలాగే అడ్వాన్స్ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని భట్టి తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు.. అని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదని, తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల పూర్తి అయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్.. ఢిల్లీ వెళ్లారు కాబట్టే బనకచర్ల ప్రాజెక్ట ఆగిందని, ఏపీ మంత్రి లోకేశ్ తప్పుదోవపట్టించే వ్యాఖ్యలు చేయకూడదని.. తెలంగాణకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టే.. అని భట్టి తెలిపారు.