calender_icon.png 12 July, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేర్‌హోల్డర్లకు హింద్ జింక్ బొనాంజా!

16-08-2024 12:00:00 AM

8,000 కోట్ల ప్రత్యేక డివిడెండు చెల్లింపునకు యోచన

న్యూఢిల్లీ, ఆగస్టు 15: వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం షేర్‌హోల్డర్లకు రూ.8,000 కోట్ల ప్రత్యేక డివిడెండు ప్రకటించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక డివిడెండు ప్రతిపాదనను ఆమోదించడానికి హింద్ జింక్ డైరెక్టర్ల బోర్డు వచ్చే మంగళవారం సమావేశమవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రతీ ఏడాది చెల్లించే సాధారణ డివిడెండు రూ. 6,000 కోట్లకు ఈ రూ.8,000 కోట్ల ప్రత్యేక డివిడెండు అదనం. కంపెనీ ప్రతిపాదిస్తున్న డివిడెండులో 30 శాతం (రూ.2,400 కోట్లు) కేంద్ర ప్రభుత్వానికి వెళుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హింద్ జింక్‌లో కేంద్రానికి 29.5 శాతం వాటా ఉన్నది.

కేంద్రంతో పాటు ఈ కంపెనీ ప్రమోటర్ అయిన వేదాంత లిమిటెడ్‌కు డివిడెండుతో భారీ ప్రయోజనం కలుగుతుంది. హింద్ జింక్‌లో వేదాంతకు దాదాపు 65 శాతం వాటా ఉన్నది. దాదాపు రూ.5,100 కోట్లు ప్రమోటింగ్ సంస్థ అందుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం హిందుస్థాన్ జింక్ రూ.5,483 కోట్ల డివిడెండును చెల్లించగా, కేంద్రానికి ఉన్న 29.5 శాతం వాటాకుగాను రూ.1,622 కోట్లు లభించాయి. 2022 కంపెనీ రికార్డుస్థాయిలో రూ.32,000 కోట్లు చెల్లించింది. ప్రభుత్వ ఖజానాకు దీనితో రూ. 9,000 కోట్లు సమకూరింది. మరోవైపు వేదాంత హిందుస్థాన్ జింక్‌లో తన వాటాలో 3.31 శాతాన్ని (14 కోట్ల షేర్లు) ఆఫర్ పర్ సేల్‌గా విక్రయించనుంది.  బీఎస్‌ఈలో హింద్ జింక్ షేరు ధర రూ.573 వద్ద ముగిసింది.