calender_icon.png 24 October, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి..

23-10-2025 01:29:44 AM

స్టార్ భామ రష్మిక మందన్న తాజాగా ‘థామ్మా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. మాడాక్ ఫిల్మ్స్ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోర్దార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా రష్మిక ఈ సినిమా జర్నీలోని విశేషాలను పంచుకుంది. మూవీ సెట్స్‌లో తీసిన కొన్ని బీటీఎస్ ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఈ సందర్భంగా చిత్రబృందం గురించి మాట్లాడుతూ.. “థామ్మా.. ఈ సినిమా ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి.. తొలి కాల్‌షీట్ నుంచి చివరిరోజు కట్ వరకూ ప్రతీదీ మనసుకు హత్తుకున్నదే. కేవలం వర్క్ చేయడమే కాదు.. భరోసా, నవ్వులు, గాయాలు, నిద్ర లేవడానికి ఇష్టపడని ఉదయాలు.. షూటింగ్ ముగించడానికి అంగీకరించని రాత్రులు.. అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దర్శకుడు ఆదిత్య నాపై నమ్మకంతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులోని ప్రతి సన్నివేశంలోనూ ఆయన అంకితభావం కనిపిస్తుంది.

ఆయనపై గౌరవంతో నా హృదయం నిండిపోయింది. ఇక సిబ్బంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. వారి వల్లే మేం షూటింగ్ సజావుగా చేయగలిగాం. ఎత్తయిన కొండ ప్రదేశాలకు కూడా సరికరాలు మోసుకొచ్చారు. షూటింగ్ టైమ్‌లో పడిన కష్టాన్నంతా సినిమా రిలీజ్ తర్వాత వచ్చే పాజిటివ్ కామెంట్స్‌తో మర్చిపోతాం” అంటూ తన నోట్‌లో పేర్కొంది. ‘మీ ప్రేమ, మద్దతు, నమ్మకం అన్నిటినీ నేను చూస్తున్నా. మీ ప్రతి భావన నా హృదయాన్ని తాకుతుంది. అది నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అంటూ తన అభిమానులకు సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. రష్మిక ప్రస్తుతం ‘మైసా’ అనే సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండతోనూ మరో సినిమా చేస్తోంది.