23-10-2025 01:28:42 AM
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూడు గీతాలు సంగీత ప్రియులను అలరించాయి. తాజాగా చిత్రబృందం నాలుగో గీతాన్నీ విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అనే ఈ మాస్ సాంగ్‌ను రవితేజ మాస్‌కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టు స్వరపరిచారు.
‘ఈ పాటకు రిథం లేదు.. కదం లేదు.. పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు.. స్వార్థంగీర్థం అసలు లేదు.. సూపర్ డూపర్ హిట్టు సాంగ్.. ఈ పాటకు స్కేలు లేదు.. పెన్ను లేదు.. పేపర్ లేదు.. తాళం లేదు తలుపుల్లేవు.. తలాతోకా లేనే లేదు.. సూపర్ డూపర్ హిట్టు సాంగ్...’ అంటూ సాగుతోందీ పాట. ఈ పాటలో ఓ చోట ‘అందరొక్కచోటగూడి పాడుకునే పాటరా..’ అని చెప్పినట్టే జరిగేటట్టుందీ జోరు చూస్తుంటే! అన్నట్టూ, ఈ పాటకు అది లేదు ఇది లేదు అంటూ సాగుతోంది కానీ, పక్కా మెజర్‌మెంట్స్ వేసుకొని మరీ ఈ పాటను వదిలనట్టు అర్థమవుతోంది!! ఇక ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యాన్ని అందించగా, దీనికి స్వరాలు సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్‌తో కలిసి ఆలపించారు. అక్టోబర్ 31న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన; కెమెరా: విధు అయ్యన్న; కూర్పు: నవీన్ నూలి; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.