25-04-2024 01:27:58 AM
స్వల్పంగా పెరిగిన ఆదాయం
రూ.24 తుది డివిడెండుకు సిఫార్సు
ముంబై, ఏప్రిల్ 24: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నిరుత్సాహకరమైన ఫలితాల్ని వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదేకాలంకంటే 6 శాతం క్షీణించి రూ.2,552 కోట్ల నుంచి రూ. 2,406 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.14,638 కోట్ల నుంచి రూ.14,693 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.24 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. కంపెనీ ఇబిటా 1 శాతం తగ్గి రూ.3,535 కోట్ల వద్ద నిలిచింది. ఇబిటా మార్జిన్ 40 బేసిస్ పాయింట్ల మేర క్షీణించి 23.5 శాతంగా నమోదయ్యింది.
రూ.10 వేల కోట్ల మార్క్‌ను దాటాం
పూర్తి ఆర్థిక సంవత్సరంలో తమ నికరలాభం రూ.10,000 కోట్ల మార్క్‌ను దాటిందని, తమ బ్రాండ్లపై పెట్టుబడులు పెంచుతామని హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా చెప్పారు. సాధారణ రుతుపవనాలు, స్థూల ఆర్థిక పరిస్థితుల మెరుగు దల కారణంగా వినియోగ డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.