9 July, 2026 | 1:28 AM

కొత్తపేటలో హైడ్రా భారీ కూల్చివేతలు

09-07-2026 12:34 AM
  1. రూ.14 కోట్ల విలువైన 700 గజాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  2. పోలీస్ స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా నుంచి విముక్తం చేసిన అధికారులు
  3. అక్రమ నిర్మాణాలు నేలమట్టం.. భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు
  4. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరిక

నాగోల్, జూలై 8 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా అధికారులు మరోసారి భారీ చర్యలు చేపట్టారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం కోసం గతంలో కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి గుడిసెలు, షెడ్లు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు బుధవారం ఉదయం భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. సుమారు రూ.14 కోట్ల విలువైన 700 గజాల ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొత్తపేట గ్రామ సర్వే నంబర్135లోని ఈ స్థలాన్ని 2007లో రెవెన్యూ శాఖ చైతన్యపురి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం కోసం అధికారికంగా కేటాయించింది.

అప్పట్లో పోలీస్ స్టేషన్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా కొందరు కబ్జాదారులు ఈ స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు పత్రాల ఆధారంగా ఆక్రమించి గుడిసెలు, తాత్కాలిక షెడ్లు నిర్మించారు. అనంతరం అక్కడ వ్యాపార సముదాయాల మాదిరిగా వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు తెలిపారు. తమకు కేటాయించిన స్థలం కబ్జాకు గురైన విషయాన్ని గుర్తించిన చైతన్యపురి పోలీసులు హైడ్రా ఉన్నతాధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి సంయుక్తంగా కార్యాచరణ రూపొందించారు.

బుధవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలు, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్న హైడ్రా బృందం అక్రమ గుడిసెలు, షెడ్లు, ఇతర నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసింది. కూల్చివేతల సందర్భంగా కొందరు ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం అధికారులు మొత్తం ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని భవిష్యత్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నరసింహ, ఉప్పల్ మండల తహసీల్దార్ హేమమాలిని, చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల కార్యక్రమం జరిగింది.

రెవెన్యూ, హైడ్రా, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను కాజేయాలనే ప్రయత్నాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజలు కూడా ప్రభుత్వ స్థలాలపై అక్రమ ఆక్రమణల సమాచారం అధికారులకు అందించాలని సూచించారు. కొత్తపేటలో చేపట్టిన ఈ కూల్చివేతలతో విలువైన ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో స్థానికంగా ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.