calender_icon.png 3 January, 2026 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా దూకుడు!

03-01-2026 12:42:30 AM

  1. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కొరడా

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదు

నిషేధిత స్థలాన్ని పార్కింగ్‌కు వాడుకుంటున్నట్లు నిర్ధారణ

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిపై క్రిమినల్ కేసు 

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 2 (విజయక్రాంతి):  నగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. ఆక్రమణదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కొరడా ఝుళిపించింది. దుర్గం చెరువు పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డారన్న అభియోగంపై మాదాపూర్ పోలీ సులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

హైడ్రా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. దుర్గం చెరువుకు ఉన్న ప్రాధాన్యత రీత్యా అక్కడ కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయితే, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి స్థలాన్ని ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్‌జోన్ పరిధిలోని స్థలాన్ని ఆక్రమించి, దానిని పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పర్యా వరణ నిబంధనలకు విరుద్ధంగా, చెరువు స్థలాన్ని సొంత అవసరాలకు వాడుకోవడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కేవలం ఎమ్మెల్యేనే కాకుండా, వెంకట్‌రెడ్డి అనే మరో వ్యక్తి పేరును కూడా అధికారులు ఫిర్యాదులో చేర్చారు. ఆక్రమణకు బాధ్యులుగా వీరిద్దరిని పేర్కొంటూ హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన పోలీసులు ఎమ్మెల్యే కొత్త ప్రభార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆక్రమణదారుల్లో గుబులు 

చెరువుల ఆక్రమణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై కూడా కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖుల ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా, తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడంతో ఆక్రమణదారుల్లో గుబులు మొదలైంది.