07-04-2025 12:14:26 AM
అభివృద్ధి.. ఆదరాభిమానంతోనే సర్వేలో ముందంజ
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేలో వెల్లడి
నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
విజయక్రాంతితో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఉన్నత చదువు చదివి ప్రజా సేవలో మమేకం కావాలన్న సంకల్పంతో రాజకీయాల్లో చేరి తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్నవయస్సులో ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎమ్మెల్యేల పనితీరు సర్వేలో టాప్ 10లో నిలిచి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా విజయక్రాంతి ప్రతినిధి ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తెలంగాణ పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో తాను టాప్ 10 లో ఉండడం శుభసూచకమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. ఈ సర్వేలో భాగంగా ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, అందిస్తున్న సేవలను బట్టి ఆ సర్వే టాప్ 10 లో నిర్వహించడం గొప్పవరమని తెలిపారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మెదక్ నియోజక వర్గం అభివృద్ధిలో ఎంతగానో వెనుకంజలో పడిందని గుర్తు చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్నమెదక్ లో ఉన్న జిల్లా కార్యాలయాలను పక్క నియోజకవర్గంకు తరలించి మెదక్ ప్రజలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దగా చేసిందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మెదక్ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అంతే కాకుండా మెదక్ జిల్లా కేంద్రం నుండి తరలిన జిల్లా కార్యాలయాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంఛిన మెదక్ చర్చితో పాటు ఏడుపాయల దేవస్థానాన్ని నేటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ చర్చికి, ఏడుపాయల దేవస్థానంకు తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
అంతే కాకుండా మెదక్ కు మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం కొబ్బరికాయలను కొట్టడమే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే మెదక్ కు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను తీసుకువచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. మెదక్ లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యేగానే కాకుండా మైనంపల్లి స్వచ్చంధ సంస్థ ద్వారా కూడా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు స్వచ్చందంగా ఎంఎస్‌ఎస్‌ఓ సంస్థ ద్వారా రూ.25 వేలు డిపాజిట్ చేసిన ఘనత ఎంఎస్‌ఎస్‌ఓ సంస్థదని తెలిపారు. ఇదే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు మైనంపల్లి కుటుంభం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయనస్పష్టంచేశారు.