15-08-2025 05:10:39 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ములకలపల్లి లోని ప్రభుత్వ కార్యాలయాలు, మండలంలోని గ్రామపంచాయతీల కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ పార్టీలకు చెందిన కార్యాలయాల ఎదుట అధికారులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి నాయకుల చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు.
తాసిల్ కార్యాలయం ఎదుట తాసిల్దార్ గన్యా నాయక్, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎస్ వి సత్యనారాయణ, స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై మధు ప్రసాద్, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, కో-ఆపరేటివ్ కార్యాలయం ఎదుట అధ్యక్షురాలు సునంద, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్యాధికారి సాయి కళ్యాణ్, పశు వైద్యశాల ఎదుట వైద్యాధికారి రామకృష్ణ, మండలంలోని 20 గ్రామ పంచాయతీల కార్యాలయాల ఎదుట ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. పిల్లలకు చాక్లెట్లు స్వీట్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే పర్యటన:
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మూక మామిడి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో, కమలాపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్సలు చేయించుకుని సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న 31 మందికి మంజూరైన రూపాయలు 12.30 లక్షలను స్థానిక రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.