25-08-2025 12:50:18 AM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ బాలీవుడ్‌లో ‘పరమ్ సుందరి’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాన్స్ చేయనుంది. తుషర్ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అనంతరం జాన్వీపై నెట్టింట ఇటీవల విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఉత్తరాదికి చెందిన ఆమెను మలయాళ యువతిగా చూపించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో నటించేందుకు మలయాళ హీరోయిన్స్ లేరా? అంటూ గాయని పవిత్రా మేనన్ లాంటి వారు సైతం ప్రశ్నించారు. ఈ విమర్శలపై జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. “ఔను, నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ (శ్రీదేవి) కూడా మలయాళీ కాదు. కానీ, కేరళ సంస్కృతి పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపిస్తా.
ముఖ్యంగా మలయాళ సినిమాలకు నేను అభిమానిని. ‘పరమ్ సుందరి’ సినిమాలో నేను మలయాళ అమ్మాయిగానే కాదు తమిళ అమ్మాయిగానూ కనిపిస్తా. ఇది వినోదాత్మక కథ. ఈ సినిమాలో భాగం కావటం ఆనందంగా ఉంది” అని తెలిపింది. ఇక జాన్వీకపూర్ తెలుగులో భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది.
ఇప్పటికే ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌తో నటించిన ఈ బ్యూటీ రామ్‌చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో జత కట్టనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చిలో రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా విడుదల కానుంది. ఇక ‘దేవర2’తోపాటు అల్లు అర్జున్, అట్లీ చిత్రంలోనూ నటిస్తోంది.