calender_icon.png 25 August, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండస్ట్రీలో సంస్కరణలు అవసరం

25-08-2025 12:48:23 AM

సీఎం రేవంత్‌రెడ్డితో టాలీవుడ్ దర్శక నిర్మాతల భేటీ 

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం సాయంత్రం కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో పలువురు దర్శకులు, నిర్మాతలు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో సమావేశమయ్యారు. ఇటీవల సమ్మెతో ఇండస్ట్రీలో గందర గోళ పరిస్థితి నెలకొన్న తరుణంలో ఫిల్మ్ మేకర్స్‌తో సీఎం ప్రత్యేక సమావేశమయ్యారు.

సీఎంతో సమావేశానికి హాజరైనవారిలో ప్రధానంగా నిర్మాతలు అల్లు అరవింద్, డీ సురేశ్‌బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ యెర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్‌కేఎన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్‌రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, శ్రీకాంత్ ఓదెల ఉన్నా రు.

వారి వెంట సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమే. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను.

నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినీ పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.

పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందే.

పరిశ్రమ విషయంలో నేను తటస్థంగా ఉంటాను. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే నా ధ్యేయం” అన్నారు.