21-09-2025 12:27:45 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోని పెండింగ్ సమస్యల పరిష్కార బాధ్యత తనదేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని వెల్ఫేర్ సొసైటీలు, శాఖలు సమగ్రమైన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. విద్యా ర్థుల సంక్షేమం, బోధన, వసతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించ రాదని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలపై ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎస్సీ గురుకుల కార్యదర్శి కృష్ణఆదిత్య, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీయుల్లా, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ పటిష్ఠానికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాల విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. గురుకుల విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.
విద్యార్థులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా వసతి, ఆహారం, వైద్య సదుపాయాల్లో నాణ్యత కాపాడాలని ఆదేశించారు. విద్యావ్యవస్థను మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. రాష్ర్టం విద్యా రంగంలో ముందంజలో ఉండేలా ప్రతి గురుకులం రోల్ మోడల్ కావాలని స్పష్టం చేశారు.
ఉద్యోగులు వేతనాల విషయంలో టెక్నికల్ సమస్య..
మైనార్టీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో టెక్నికల్ ఎర్రర్ సమస్య వచ్చిందని, సమస్యను వెంటనే పరిష్కరించి జీవో విడుదల చేసి జీతాలు ఇప్పించామని తెలిపారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల తప్పిదం వల్ల టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని, సమస్యపై సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడి పరిష్కారం చేశామని పేర్కొన్నారు. ఉద్యోగుల పదోన్నతులు, ఇతర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ప్రమోషన్ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సోమవారం లేదా మంగళవారం ఉద్యోగులకు జీతాలు అందుతాయని స్పష్టం చేశారు. టెమ్రిస్ ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి అసలే లేదని, మొత్తం 24 క్యాడర్లలో 18 క్యాడర్ల ఉద్యోగుల వేతనాలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 2023-24, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వేతనాల జీవోలు జారీ చేసిందని వెల్లడించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.