13-07-2025 12:39:42 AM
మత్తుకెందుకో తెలియకుండా అయ్యేను బానిస
యువతకెందుకో మత్తుమాయతో మారింది ధ్యాస
అమ్మ నాన్నా నేర్పలేదే ఎప్పుడూ ఆ భాష
మన ప్రకృతిలో వినలేదే ఎప్పుడూ ఈ శోష
ఎగిరేటి పక్షులు, ఈదేటి చేపలు
దూకేటి చిరుతలు, పరుగెత్తు జింకలు
అవి జంతువులైనా, ఎంత క్రూరములైనా
కనిపించదే వీటిలో ఇంత ఘోరము
తట్టలేదు మత్తనే నరకపు ద్వారము
అనుభవించునే ఆస్వాదిస్తూ
జీవితమనే దేవుడిచ్చిన వరము
ఆడి పాడే వయసప్పుడు
వలపు తోటలు పూచేటప్పుడు
వయసుకు జోడే కావలసినప్పుడు
తల్లిదండ్రులకు తోడై ఉండేటప్పుడు
గమ్యం మరిచావో దారే తప్పావో
వెదికేదెందుకురా మాదకద్రవ్యం
తలకిందులు చేసే తీరని వ్యామోహం
అవుతారందరు అతలాకుతలం
జారిపోతుంటే నువ్వు అధఃపాతాళం
ఓటమి ఎదురైనా, గెలుపన్నది కరువైనా
ఆశలు అడుగంటినా, రేపన్నది మరవాలని
నేర్చుకొనేదెందుకు, ఈ అంతులేని వ్యసనం
తలవంచేదెందుకు, ఇది ఎవరో రాసిన చీకటి శాసనం
చేసుకొనేదెందుకు భవిష్యత్తు నాశనం
కావడమెందుకు నిర్జీవపు ప్రహసనం
వెంటపడితే మాదకద్రవ్యం చేస్తుంది
నిన్నొక మారని ద్రవ్యం
మానకపోతే మత్తును అయిపోతావు
నువ్వొక రాయని కావ్యం
మరిచిపోకుండా నీ కర్తవ్యం మారడమే
నిజానికి నీకిప్పుడు భావ్యం
కావాలంటే యువతా! మీ కథ బహు శ్రావ్యం.
రెక్కలనెందుకు విరుచుకునేది,
చుక్కలపైకి ఎగిరే వయసులో
కొకైన్ కాదురా నీకు కిక్కు,
అది నీ పాలిట వీడని చిక్కు
ఎల్ ఎస్ డి తెరవని రేపటి తలుపు
నీ ఆశల తోటలో కనబడిన కలుపు
చేయకు ఇకపై దానిమీద మదుపు
జీవితాన్ని భయానకంగా అది కుదుపు
మీ అమ్మ నిన్ను ఆశతో పిలుస్తోంది
కన్నీరు మున్నీరై నీకై విలపిస్తోంది
అస్తవ్యస్తమైపోయిన మీ నేస్తం
చాచినాడిదిగో నీకోసమే స్నేహ హస్తం
పిలిచాడిదిగో మీ గురువు
మళ్ళీ చెప్పాలని కొత్త పాఠం
ఓటమి కానేకాదని
బ్రతుకున బలిపీఠం
హత్తుకోవాలని, పైకెత్తుకోవాలని
అందరు నీతో కలిసుండాలని
నీలో ఒంటరితనాన్ని తరిమేయాలని
ఎదురు చూస్తున్నారునీ వారందరు
మత్తును వదిలొచ్చేయ్
మత్తుకు సెలవిచ్చేయ్..
- వనమాల