13-07-2025 08:28:22 PM
పట్టణ ఎస్సై రాజశేఖర్..
మందమర్రి (విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే వాటికి అడ్డుకట్ట వేయవచ్చని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్(SI Rajasekhar) అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో అత్యాశ, అవగాహన లేకపోవడం వలనే సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు 'డిజిటల్ అరెస్ట్' అనగానే భయపడవద్దని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే అనధికారిక లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేసి మోసపోవద్దని కోరారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు నకిలీ పిఎం కిసాన్, ఎస్బిఐ రివార్డ్ వంటి పేర్లతో ఏపీకే ఫైల్స్ ను వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారని, పొరపాటున ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సూచించారు. దీని ద్వారా ఫోన్‌లోని ఓటిపిలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళతాయనీ, అనంతరం నేరగాళ్లు బాధితుడి వాట్సాప్ ఖాతాను హైజాక్ చేసి, అదే నకిలీ లింక్‌ను అతని కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ ఆటోమేటిక్ గా పంపిస్తారని వివరించారు.
తద్వారా బాధితులు ఆర్థిక నష్టాలకు, వ్యక్తిగత డేటా చోరీకి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నకిలీ ఏపీకే ఫైల్స్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు వాట్సాప్‌లో వచ్చే అనుమా నాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థి తుల్లోనూ క్లిక్ చేయరాదన్నా రు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించారు.ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు సున్నితమైన సమాచారాన్ని ఫోన్ల ద్వారా ఎన్నడూ అడగవని ఆయన స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎంత అవగాహన కలిగి ఉంటే, వాటిని అంత సమర్థవంతంగా అరికట్ట వచ్చన్నారు.