13-07-2025 10:00:04 PM
రాజకీయ వ్యవస్థలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది..
ప్రొఫెసర్ హరగోపాల్..
హనుమకొండ (విజయక్రాంతి): గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్యం లాంటి మౌలిక రంగాలు నాశనమయ్యాయని, ప్రజలు రాజకీయ చైతన్యంతో, రాజకీయ పార్టీల స్వభావంలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడి సమగ్రాభివృద్ధి జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్(Professor Haragopal) అన్నారు. "అప్పుల ఊబిలో తెలంగాణ ప్రభుత్వం-కారణాలు- పరిష్కారాలు" అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నాయకత్వం వహించిన కెసిఆర్ మేధావుల సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదని, కేసిఆర్ ఎవరి మాట వినలేదని, నేటి పాలకులు మేధావుల సూచనలను విన్నప్పటి వాటి అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
ఆర్థిక శాస్త్రంలో విశ్లేషణలు, సూచనలు ఉంటాయని, రాజకీయ శాస్త్రంలో, రాజకీయాల్లో పరిష్కారాలుంటాయని అన్నారు. తెలంగాణలో పరిష్కారం చూపాల్సిన రాజకీయాలే సమస్యగా మారిన దుస్థితి నెలకొందని అన్నారు. రాజకీయాలకు, ఉపయోగకరమైన నిర్ణయాలకు ప్రజలు కేంద్రంగా ఉంటారని అలాంటి ప్రజల నుండి విలువైన సూచనలు, సలహాలు తీసుకొని పాలకులు అభివృద్ధి ప్రణాళికలు రచించి అమలు పరచాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం నయా ఉదారవాద విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని అన్నారు. విలువలు, ప్రజల అభివృద్ధి లేని రంగాల్లో అభివృద్ధి జరగడం వల్ల సమగ్ర అభివృద్ధి జరగడం లేదని, గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్య, వ్యవసాయ, ఉపాధి రంగాలు కుదేలయ్యాయని, ఆరోగ్యశ్రీ వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ప్రభుత్వ విద్య నాశనమయిందని అన్నారు.
సామాన్య ప్రజలు వాస్తవ స్థితిగతులను అర్ధం చేసుకునే స్థితిలో లేరని, ప్రభుత్వ విద్య, వైద్యం వల్ల మేలు జరగదనే బలమైన భావన ప్రజల్లో నెలకొన్నదని అన్నారు. పాలకులు, వ్యాపారులు కలిసి ప్రజలను ఇలాంటి దుస్థితికి నెట్టారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగం బాగుపడాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, విలువలతో కూడిన రాజకీయాలు నిర్మితం కావాలని అన్నారు. పౌర సమాజం నిశబ్దంగా ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ప్రజల చైతన్యంతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని అన్నారు. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు బాగుపడే పాలన కోసం ప్రజలు చైతన్యంతో ముందుకు సాగాల్సిన అవసరముందని అన్నారు.
ఈ సదస్సుకు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్లు డి. నర్సింహారెడ్డి, ఆర్.వి. రమణమూర్తి, సదానందం, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమనేని జగన్ మోహన్ రావు, వీరమల్ల బాబురావు, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సుశీల, చాపర్తి కుమార్ గాడ్గే, డాక్టర్ ప్రవీణ్ కుమార్, బుసిగొండ ఓంకార్, వల్లాల జగన్ గౌడ్, సంఘాని మల్లేశ్వర్, కొంగ వీరాస్వామి, మేకల కేదారి యాదవ్, నలిగింటి చంద్రమౌళి, లంకా పాపిరెడ్డి, బొమ్మినేని పాపిరెడ్డి, పల్లపు సమ్మయ్య, న్యాయవాదులు విలాసాగరం సురేందర్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, జన్ను పద్మ, బండి మొగిలి, జె జె స్వామి, వివిధ సంఘాల నాయకులు పెండ్లి అశోక్ బాబు, మంద వీరస్వామి, పరిశరాములు, తిరుపతి, బట్టి శ్యామ్ యాదవ్, దిడ్డి ధనలక్ష్మి, సద్గుణ, సురేఖ, స్వరూప, గోధుమల కుమారస్వామి, కొంగర జగన్, సాంబలక్ష్మీ, సూరం నిరంజన్, కూరపాటి భార్గవి, సద్గుణ, రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.