13-07-2025 08:56:42 PM
ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌లో 15 మంది ఐటీ ఉద్యోగులు పట్టుబాటు..
శేరిలింగంపల్లి: భాగ్యనగరంలోని హైటెక్ కారిడార్ వాసులే లక్ష్యంగా గంజాయి దందా సాగిస్తున్న ముఠాను ఈగల్ టీమ్(Eagle Team) అడ్డగించింది. ప్రత్యేకంగా చేపట్టిన డెకాయ్ ఆపరేషన్(Decoy operation)లో గంజాయి విక్రేత సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. ఈ ముఠా టార్గెట్ చేసినవారు ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. "బచ్చా ఆగయా" అనే కోడ్‌తో సందీప్ కస్టమర్లతో సంభాషిస్తూ డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డెకాయ్ ఆపరేషన్‌లో గంజాయి కోసం వచ్చిన 15 మంది ఐటీ ఉద్యోగులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరంతా సందీప్ పంపిన మెసేజ్‌ల ఆధారంగా లొకేషన్‌కి చేరినట్లు గుర్తించారు. ఐటీ క్యాంపస్‌ల మధ్యే ఈ మత్తు ముఠా నడుస్తుండడంపై అధికారులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగ భారం, ఒత్తిడికి చెక్ వేసేందుకు యువత మత్తు దారిలోకి వెళ్లిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. గంజాయి దందా వెనుక ఉన్న ముఠాను బట్టబయలు చేసేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.