01-12-2024 02:30:32 AM
౩ లక్షల 1౩ వేల కుటుంబాలకు రూ.2,747 కోట్లు.. నాలుగో విడుత రుణమాఫీ
ప్రతిపక్షాల కుతంత్రాలు సాగనివ్వ..
* 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా. ఇప్పటివరకు ఇంత మొత్తంలో, తక్కువ సమయంలో రుణమాఫీ ఎవరైనా చేశారా? సవాల్ విసురుతున్నా.. మోదీ, కేసీఆర్ ఎవరు వచ్చినా, ఇద్దరూ కలిసి వచ్చినా చర్చకు సిద్ధం.
సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబర్ 30 (విజయక్రాంతి): పాలమూరు జిల్లాకు సంవత్సరానికి రూ.20వేల కోట్లు ఇచ్చేందుకు మంత్రిమండలిని అడుగుతున్నానని.. ఇలా ఐదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తే జిల్లా అంతా పంటలు పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పాలమూరు తలరాత మారుస్తానని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని.. 70 యేండ్లు కన్నీళ్ళతో బతికామని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష 2 వేల కోట్లు తీసుకుపోయినా, కట్టింది కుప్పకూలిందని చెప్పారు.
నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లం సాగర్ ప్రాజెక్టులు ఎన్ని వరదలు వచ్చినా వ్యవసాయానికి, తాగునీరుకు చెక్కుచెదరకుండా నీరు అందిస్తున్నాయని తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
రైతు పండుగ వేడుకల్లో ఏర్పాటు చేసిన 155 ప్రత్యేక స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు పండుగ విజయోత్సవ వేడుకల్లో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పాలమూరును ఎవరో వచ్చి దత్తత తీసుకోవడ మేంటని, మనం గతిలేని వాళ్ళం కాదని, చేతకాని వారిమి అసలు కాదన్నారు.
రాళ్ళపాడు నుంచి గద్వాల, ఆలంపూర్ వరకు ప్రాజెక్టును పూర్తిచేయాలని అనుకుంటే, నిధులు ఇవ్వాలని అడుగుతుంటే.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన అల్లుడు హరీశ్‌రావు ఎందుకు కడుతారని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన అంటూ గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటి సాగనివ్వనని స్పష్టం చేశారు. నవంబర్ 30వ తేదీకి ఓ ప్రత్యేక ఉందని, 2023 సంవత్సరంలో ఇదే రోజున గడీల పాలనను కుప్పకూల్చి ప్రజలు ప్రజాపాలనకు పట్టంకట్టిన రోజన్నారు. సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
పాలమూరు జిల్లాలో కరువును పారద్రోల్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గల గలలను చూశాను. కన్నబిడ్డలను గుడిసెల దగ్గర విడిచిపెట్టి వలస వెళ్లుతున్న పాలమూరు బిడ్డలను గుంపుమేస్త్రీలు తీసుకుపోతుంటే చూశాను.
తట్ట, పార పని కోసం ఆనాడు ప్రత్యేకంగా వందలాది రైతాంగాన్ని తీసుకుపోయారు. ఆ నాడు అనుకున్నా.. ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తుంది అని.. ఇప్పుడు అవకాశం వచ్చింది. సరిగ్గా 70 సంవత్సరాల తరువాత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు.. మీ బిడ్డకు గిప్పుడు అవకాశం వచ్చింది. జవాబుదారీతనంతో పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
పదేండ్లలో రెండుమార్లు సీఎం అయినా ఏం లాభం?
గత పదేండ్ల కాలంలో రెండుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏమి చేశారో నాకంటే మీకే బాగా తెలుసు. ఆనాడు కేసీఆర్ వరివేస్తే ఉరివేసుకున్నట్లే అని చెప్పారు. ఈ ప్రజా ప్రభుత్వంలో వరివేస్తే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించారు. రికార్డు స్థాయిలో పంట పండించిన రైతుల ఖాతాల్లో.. మూడు రోజుల్లోనే కనకవర్షం కురిపిస్తుంటే, బీఆర్‌ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లు ఉంది.
ఆనాడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. లక్ష 83 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ. లక్ష 2 వేల కోట్లు కాళేశ్వరం కట్టేందుకు వినియోగించారు. ఆనాడు పండిన పంటలు కాళేశ్వరంతోనే సాధ్యం అయ్యాయని చెప్పారు. నాడు మేం ఏమి అనలేదు. వారు కట్టిన ప్రాజెక్టులో సుందిళ్ల, మేడిగడ్డ, నాలుగు విడతలు అన్నాడు.. మిత్తి నేను కడుతా అన్నాడు. 2013 నుంచి 2023 వరకు లక్ష రుణమాఫీ చేస్తానన్నారు.
అఖరి సంవత్సరం అవుటర్ రింగ్‌రోడ్డును అమ్మి రూ.11వేల కోట్ల రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రూ.8,596 కోట్లు మిత్తికే పోయాయి. అసలు చెల్లించిది కేవలం రూ.2500 మాత్రమే. ఆనాడు అవుట్ రింగ్‌రోడ్డును రూ.7,500 కోట్లకు విక్రయించారు. హరీశ్‌రావు.. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మొదటి సంవత్సరంలో మాఫీ చేసి ఉంటే రూ.8,500 కోట్లతోనే రుణమాఫీ పూర్తయ్యేది.
ఈ విషయాలు అన్ని పరిగణలోకి తీసుకుని, మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సలహా తీసుకున్నా. బరాజ్‌లు కుప్పకూలి చుక్క నీరు పారకపోయినా 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చరిత్రలో 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా, ఉమ్మడి రాష్ట్రం అనగా తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు కలిపి మొత్తం 23 జిల్లాలు కలిపి ఒక్క పంటకు ఇంత మొత్తంలో ధాన్యం ఎప్పుడూ పండలేదు.
25 రోజుల్లో 22లక్షల 22వేల 62 మంది రైతు కుటుంబాలకు రూ.17,869 కోట్ల రుణమాఫీ చేశాం. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సవాల్ విసురుతున్నా. ఇప్పటివరకు ఇంత మొత్తంలో తక్కువ సమయంలో రుణమాఫీ ఎవరైనా చేయడం జరిగిందా?. నరేంద్రమోదీ, కేసీఆర్ ఎవరు వచ్చినా, ఇద్దరూ కలసి వచ్చినా చర్చకు సిద్ధం. 3లక్షల 13వేల కుటుంబాలకు రూ.2747 కోట్ల నాల్గవ విడత రుణమాపీ చేశాం.
మొత్తంగా 25లక్షల రైతు కుటుంబాలకు 21వేల కోట్ల రూపాయాలను రుణమాఫీ చేసిన ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం. దళితులకు, గిరిజనులకు, ఆదీవాసీలకు, బలహీనవర్గాలకు భూ పంపకాలు చేసి ఆసైన్డ్‌పట్టాలను ఇవ్వడం జరిగింది. రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించిన చరిత్ర తమది.
ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చారు. రైతుబీమా అమలు చేసింది తామే అని, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ సహకారంతో రుణమాఫీ చేశాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. దీని మీద చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు వస్తారో రావాలి.
నువ్వెట్ల అన్యాయం చేశావ్ కేసీఆర్
ఆనాడు సీమాంధ్ర ముఖ్యమంత్రులు అన్యాయం చేశారని కేసీఆర్ అన్నారు. మరి కేసీఆర్ ఎందుకు అన్యాయం చేశారు. 2009లో మీరు అక్కడ ఓడిపోతరని, పాలమూరు వస్తే గుండెల్లో పెట్టుకుని గెలిపించి ఢిల్లీకి పంపింది పాలమూరు ప్రజలు కాదా. తెలంగాణ తెచ్చినా అంటూ గొప్పలు చెప్పుకొన్న నువ్వు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయావ్.
మా గుండెల మీద తన్ని మమల్ని మోసం చేసి, వలసలు శాశ్వతంగా ఉండేలా చేసి దుబాయి, పూణెలు పోయి పనులు చేసేలా చేసింది నువ్వుకాదా?. నారాయణపేట ప్రాజెక్టు పనులు చేయాలనుకుంటే దానిని ఎందుకు అడ్డుకున్నావు. మా జిల్లాకు 70 సంవత్సరాల తరువాత అవకాశం వచ్చింది. మమల్ని వాడు, వీడు వచ్చి పాలమూరు దత్తత తీసుకుంటున్నామని చెప్పారు.
ఎవరూ పాలమూరును అభివృద్ధిని చేయలే. ఆనాడు చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌లు పాలమూరును దత్తత తీసుకుంటామని చెప్పారు. ఈనాడు మా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరో వచ్చి మమ్మల్ని దత్తత తీసుకోవడమేంటి, మనం గతిలేని వాళ్ళం కాదు. చేతకాని వాళ్లం అసలే కాదు. రూ.20లక్షల కోట్లు మీ చేతుల్లో ఉన్నాయి కాదా ? 20వేల కోట్లు ఎందుకు మాకు ఖర్చు చేయడం లేదన్నారు.
రాళ్ళపాడు నుంచి గద్వాల, అలంపూర్ వరకు ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకుంటే నిధులు ఇవ్వాలని, అడుగుతుంటే చంద్రశేఖర్‌రావు, అతని అల్లుడు ఎందుకు కడుతారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించుకుందాం. పాలమూరుకు ఇంజినీరింగ్ కళాశాలను, కొడంగల్‌కు మెడికల్ కళాశాలను తీసుకొచ్చాం. అన్ని స్కూల్స్, విద్యాసంస్థలను తెచ్చాం.
జిల్లాకు ఈ పనులు చేయాలన్నా అని అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలు చిట్టీలు ఇచ్చారు. ఒక్కొక్కటి కాదు అన్ని చేసుకుందాం. అవసరమైతే మా జిల్లాకు సంవత్సరానికి రూ. 20వేల కోట్లు ఇచ్చేందుకు మంత్రిమండలిని అడుగుతున్నా. 70 యేండ్లు కన్నీళ్ళతో బతికాం. తాగడానికి నీరులేదు. చనిపోయినప్పుడు నెత్తిమీద నీరు పోసుకునేందుకు కూడా మాకు నీరులేదు.
పాలమూరు జిల్లా నుంచి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. వదులుకుందామా?. ఈ జిల్లాకు ఐదేండ్లలో లక్ష కోట్లను తీసుకువస్తే జిల్లా అంతట పంటలు పండుతాయి. కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టుకు రూ.1 లక్ష 2 వేల కోట్లు తీసుకుపోయాడు. కట్టింది కుప్పకూలింది. నెహ్రూ కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎన్ని వరదలు వచ్చినా వ్యంసాయానికి, తాగునీరుకు చెక్కుచెదరకుండా నీరు అందిస్తున్నాం.
పాలమూరు గడ్డ కోసమే ఈ కుర్చీలో కూర్చున్నా..
మాయగాళ్ల మాటలు విని పరిశ్రమల ఏర్పాటును అడ్డుకోవద్దు. కొడంగల్ ప్రాంతంలో 3లక్షల ఎకరాలు ఉంటే 1,300 ఎకరాల భూ సేకరణ చేసేందుకు చర్యలు తీసుకుని ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి 20, 30వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పెద్ద కంపెనీలు తీసుకువస్తే నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల భూమి ఉంది.
కొడంగల్‌ను అభివృద్ధి చేయాలనుకుంటే లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి లంబాడి సోదరులను జైలుకు పంపించారు. ఆనాడు అగ్గిపెట్టె రావు రూ.100 పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు. రూపాయి పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేదు. మా పిల్లలపై కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను ఎత్తివేయాలని నన్ను కోరినా అది మన చేతుల్లో ఉండదన్నాను. ముఖ్యమంత్రిగా ఉన్న నాపైనే 102 కేసులు ఉన్నాయి.
ముఖ్యమంత్రి పదవి ఉంటే కేసులు కోట్టివేయలేమని తెలిపారు. ఆ కేసులు ఎప్పుడు పోతాయో తెలువదని, కుటుంబసభ్యులను ఎప్పుడు కలుసుకుంటామో తెలియని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. మీ భూములు గుంజుకుని నేను పట్నం, కొండారెడ్డిపల్లికి చాపల చుట్టి తీసుకుపోనని, అందరికి ఉపాధి అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమాయకులను కేసుల్లో ఇరికించారు.
కేసీఆర్‌కు 1000 ఎకరాల్లో ఫాంహౌస్ ఉంది. పాలమూరు ఎత్తిపోతల, నాగార్జున్‌సాగర్, ఇలా ప్రతి ప్రాజెక్టులు నిర్మిస్తే భూములు పోలేదా?. భూములు ఇవ్వమని అడ్డుకుంటే నడిగడ్డతోపాటు ఇతర ప్రాంతాల్లో భూసేకరణ జరిగేది కాదన్నారు. భూ సేకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అయితే కొంత మంది రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
ఎకరాకు రూ.10లక్షలు కాదు రూ.20 లక్షలు ఇస్తా. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ జిల్లాల్లో అభివృద్ధిని అడ్డుపడుతున్నారు. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే కాళ్లల్లో కట్టె పెడుతున్నరు. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్న అడ్డుపడుతున్నారు. ఇప్పటికీ 50వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోటి 15లక్షల మంది ఆడబిడ్డలు రాకపోకలకు సంబంధించి ఆర్టీసీకి 3700 కోట్ల ఉచిత ప్రయాణాలు ఇచ్చాం.
రూ.500లకే సిలిండర్, పాఠశాలలో మెస్ చార్జీలు 40శాతం పెంచాం. కోకాపేట భూములు అమ్మకుండా, అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. సంవత్సరం మొత్తం 72లక్షల రైతు కుటుంబాలకు 54 వేల కోట్లు ఖర్చు పెట్టాం. కేసీఆర్ కుటుంబం 7లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పటి వరకు ఆ అప్పులకు 60వేల కోట్ల మిత్తి కట్టాం.
మల్లన్నసాగర్ మల్లారెడ్డి చితిపేర్చుకొని మరణిస్తే ఏం చేసిండ్రు..
మల్లన్నసాగర్‌లో మల్లారెడ్డి అనే రైతు చితి పేర్చుకొని, కాల్చుకొని మరణిస్తే ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో.. ఆ మల్లారెడ్డి ఇంటికి పోదామా హరీశ్‌రావు?. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏమి చేసుకోలేకపోతే నన్ను చరిత్ర క్షమిస్తుందా?. ఎవరు అడ్డువచ్చినా పాలమూరు ను అభివృద్ధి చేస్తా. ఎవరికీ భయపడేది లేదు. పులులు, సింహాలను నల్లమలలో చూశా.
బీఆర్‌ఎస్ నేతలు ఎంత? చేసింది చెప్పుకోవడంలో కొంత వెనకబడిపోయామని మా భట్టి విక్రమార్క చెప్పారు. పాల మూరు వారికి కష్టం చేయడం తప్ప మరేమీ తెలువదు. ప్రజలే నాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మన ఊరు అల్లు డు. మన పాలమూరు బిడ్డను ఆయనకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆయన రు ణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లు భట్టి విక్రమార్క సంతకం పెట్టేటప్పుడు.. తెల్లకాగితం పెట్టినా అవసరం ఉన్నంతవరకు మాత్రమే పాలమూరు ప్రజలు రాసుకుంటారు.
దామోదర రాజనరసింహను నేను అడిగి మన జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా తీసుకువచ్చా. నేను అడిగితే చూడకుండా సంతకం పెడుతాడని తీసుకువచ్చిన. మంత్రి మండలి సభ్యులు అందరూ మన జిల్లాకు మంచి జరిగేందుకు.. సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది లేకుండా, సంతోషంగా పెట్టేలా మీరంతా చప్పట్లు కొట్టాలి.
సంబురాన్ని తెచ్చింది: డిప్యూటీ సీఎం భట్టి
రైతు పండుగ రాష్ట్ర వ్యాప్తంగా సంబురాన్ని తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాది పాలన కూడా పూర్తి కాని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారంగా మా ట్లాడటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. పదేళ్లలో నిరుద్యోగు లు, రైతుల సంక్షేమం, ప్రజలకు బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నా రు. పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది పారుతున్నా గత ప్ర భుత్వం పట్టించుకోలేదన్నారు.
పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించేందుకు ప్రతి నెలా రివ్యూలు ఏర్పా టు చేసి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం, జూరాల నిర్మాణంతోపాటు పాలమూరు పథకానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో జారీ చేసిందన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా 66,77 లక్షల ఎకరాలు సాగు చేస్తే లక్షా53వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని.. రూ.లక్షా2వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా ఉపయోగం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని.. కొనడం లేదనడం సరికాదన్నారు.
గత సర్కారు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రూ.2లక్షల లోపు రుణమాఫీ చేశామని చెప్పారు. 17 రోజుల్లో రూ.18వేల కోట్లతో రుణమాఫీ చేశామని, దేశ చరిత్రలో తక్కువ రోజుల్లో ఇంత మొత్తం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
రైతులు పండుగ చేసుకుంటుంటే బీఆర్‌ఎస్ నేతలు ఎడుస్తున్నారని తెలిపారు. వ్యవసాయనికి ఏడాదిలో రూ.73 వేలకోట్లు కేటాయించామన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు ఇస్తున్నామని.. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సరిచేస్తున్నాం: మంత్రి తుమ్మల
అప్పుల పాలైన రాష్ట్రాన్ని సరిచేసుకుంటూ రైతులకు మంచి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యనూ తమ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. వర్షం కురిసినా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రైతుల నుంచి తాము ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులకు సైతం సూచించినట్టు తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీని 3లక్షల మందికి అందించేందుకు మహబూబ్‌నగర్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని రైతులను పదేపదే కోరుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వానికి అండగా ఉండాలి: మంత్రి సీతక్క
పాలమూరు మట్టి బిడ్డ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, గడిచిన పదేళ్లలో ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవక ముందే రూ.18 వేలకోట్లు రుణమాఫీ చేశామన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.11 వేలకోట్లు మాఫీ చేసిందన్నారు. కౌలు రైతుల ఖాతాల్లో కూడా నేరుగా డబ్బులు పడుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి శాఖలో అప్పులు ఉన్నాయని.. రూ.60 వేలకోట్లు ఉచిత విద్యుత్‌కు చెల్లించకుండా మోసం చేశారని విమర్శించారు. రైతులు అన్ని విషయాలను గమనించి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు.
8 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి జూపల్లి
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తోపాటు అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరును పచ్చగా చేసే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి కాలం గడిపిందని విమర్శించారు.
ఎన్ని అర్థిక ఇబ్బందులు ఉన్నా సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని చెప్పారు. సక్రమంగా పాలించనందుకే ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్‌ను బొందపెట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రింగ్‌రోడ్డును అమ్మి రైతుభరోసా ఇచ్చారని.. ఇది తప్పు అని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.
రైతు సంక్షేమమే మా బాధ్యత: మంత్రి దామోదర
విజయోత్సవాల్లో రైతులు ఉత్సాహం చూస్తుంటే ప్రజాపాలనలో జరుగుతున్న మంచి తమకు తెలుస్తున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రైతుల సంక్షేమ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నాడు వైఎస్ రాజశేఖరెడ్డి రుణమాఫీ చేశారని.. ఇప్పుడు తాము రుణమాఫీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. అందరికీ సమానత్వం తీసుకొచ్చేందుకే కులగణన చేసినట్టు మంత్రి వివరించారు.
ఇది రైతు ప్రభుత్వం: అధ్యక్షుడు
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మే 4న రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు రుణమాఫీతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మయాంలో పదేళ్లలో 50వేల ఉద్యోగాలు ఇస్తే.. తాము అధికారంలోకి వచ్చి ఏడాది గడువకముందే 54వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అందరూ కలిసి గెలిపించుకున్నారని ఆయన స్పష్టం చేశారు..
కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి: రాజేశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఎల్లప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండాలని కోరారు..
రాబందుల పాలన ముగిసింది: మధుసూదన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
రాబందుల పాలనకు కాలం చెల్లిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. వేలాది రైతులు రైతు పండుగను దీవించేందుకు రావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.
రైతు పక్షాన నిలిచింది కాంగ్రెస్సే: అనిరుధ్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
గత పదేళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మోసం చేస్తూ వచ్చాయని.. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వమే నిలిచిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు.
22లక్షల మందికి రుణ విముక్తి: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రంలో సాగుకు, రైతులకు పండుగొచ్చిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 22లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పించామన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని.. వ్యవసాయాన్ని పండుగలా కాదు.. మహా ఉత్సవంలా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
నిరంతం రైతు పక్షమే: శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే
నాడు ఒక్క సంతకంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.లక్ష రుణమాఫీ చేస్తే.. నేడు ఒక్క సంతకంతో సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాడని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. .
శివమూగిన పాలమూరు
మహబూబ్‌నగర్, నవంబర్ 30 (విజయక్రాంతి): పాలమూరు శివమూగింది. సీఎం రేవంత్‌రెడ్డి హాజరైన రైతు విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం సమీపంలోని అమిస్తాపూర్‌లో మూడు రోజులుగా జరిగిన రైతు పండుగ శనివారం ముగిసింది. ముగింపు వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి తన ప్రసంగంతో రైతుల్లో జోష్ నింపారు.
వేదికపై సీఎం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల వాన కురిపిస్తుంటే.. వేదిక దిగువన ఉన్న రైతులు చప్పట్లతో మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుండగా.. ప్రజలు కరతాళ ధ్వనులతో స్పందన తెలిపారు.
పరిశ్రమలు వస్తేనే పాలమూరు గోస తీరుతుందని, ఈ ప్రాంతానికి సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటాని చెప్పడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. మీ బిడ్డ సంతకం పెడితే మన పాలమూరు భవిష్యత్తు బాగుండే స్థాయికి చేరుకుంటుందని చెప్పిన సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.
గతంలో ఎప్పుడు ఏ సభ జరిగినా ప్రభుత్వాధినేతలు, నాయకులు గంటలకు గంటలు ఆలస్యంగా వచ్చేవారు. కాగా, సీఎం సభా సమయానికి పది నిమిషాలు ముందుగానే చేరుకోవడం విశేషం.