calender_icon.png 16 November, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో ఖమ్మం విద్యార్థి కాల్చివేత

01-12-2024 02:28:31 AM

ప్రైవేట్ స్టోర్‌లో మేనేజర్‌గా పార్ట్ టైం జాబ్ 

రిలీవర్ కోసం వేచి చూస్తుండగా కాల్పులు

నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయితేజ

ఖమ్మం, నవంబర్ 30 (విజయక్రాంతి): అమెరికాలో మరో తెలుగు విద్యార్థి తూటాలకు బలయ్యాడు. అమెరికాలోని చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో  ఖమ్మం పట్టణానికి చెందిన నూకారపు సాయితేజ (26) మృతి చెందాడు.  ఖమ్మం పట్ణణంలోని రాపర్తినగర్ ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు దంపతులకు కుమార్తె, కుమారుడు సాయితేజ ఉన్నారు. కుమార్తె ఇప్పటికే అమెరికాలో స్థిరపడింది.

సాయితేజ ఈ ఏడాదే హైదరా బాద్‌లో బీబీఏ పూర్తి చేసి, చికాగోలోని కాంగోడియా యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు జూన్ 15వ తేదీన వెళ్లాడు.  చికాగోలోని ఒక ప్రైవేట్ స్టోర్‌లో మేనేజర్‌గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయం త్రం 6 గంటలకు తన డ్యూటీ అయిపోగా.. రిలీవర్ కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఇద్దరు నల్లజాతీయులు స్టోర్‌లో దొంగతనానికి వచ్చి తుపాకులతో బెదిరించి, నగదు దోచుకుని వెళ్తూ సాయితేజను కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా తానా ప్రతినిధులు సైతం అందుకు కృషి చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చే విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా సరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తానా వారితో కూడా మాట్లాడామని, నాలుగైదు రోజులు పడుతుందని అంటున్నారని చెప్పారు. కాగా అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థులు తుపాకీ తూటాలకు బలైపోతున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి భారతీయుల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేందుకు ఎన్నారై పేరెంట్స్ పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.