calender_icon.png 14 May, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక గుంట భూమి కబ్జాకు పాల్పడినట్లు నిరూపించినా..

09-04-2025 02:20:04 AM

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నాపై చేస్తున్న భూ కబ్జా ఆరోపణలను సాక్ష్యాదారాలతో నిరూపిస్తే వాళ్ళ ఇళ్లల్లో గులాంగా పని చేస్తానని, నిరూపించలేకపోతే వాళ్ళు నా ఇంట్లో గులాంగా పని చేయాలని  సవాల్ విసిరారు. మీలో నిజంగా తెలంగాణ పౌరుషం ఉంటే, మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే నా సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

గత మూడు, నాలుగు రోజులుగా టిఆర్‌ఎస్ పార్టీ దిన పత్రికలో, టీవీ ఛానల్ లో వచ్చిన వార్త కథనాలు, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ధర్మసాగర్ మండలం దేవునూర్, ముప్పారం, నారాయణగి గ్రామాలకు చెందిన రైతులు నన్ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని, పట్టా భూములను అటవీ శాఖ ఆక్రమణపై రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ నీ కలిసి రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలతో జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్దారించి రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఫారెస్ట్ శాఖ వారు జాయింట్ సర్వే నిర్వహించి, జాయింట్ సర్వే రిపోర్ట్ లో 23మంది రైతులకు సంబందించిన 43.38 ఎకరాల భూమి పట్టా భూమి  ఉందని తేలింది.

అటవీ శాఖ డ్రాఫ్ట్ లో లేని ఈ భూమి, పట్టా భూమిని నిర్దారించారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేని వారు నాపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇద్దరు అక్కడికి వెళ్లి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజలతో కలిసి మీడియా ముందే వాస్తవాలను ప్రజలకు తెలియజేసిన నేను సహకరించడానికి సిద్దంగా ఉన్నానని, దేవునూర్ అటవీ భూములలో ఒక గుంట భూమి కబ్జాకు పాల్పడిన నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తానని, పట్టాదారులైన రైతులకు న్యాయం చేయడంతో పాటు అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు.

అటవీ భూములను పరిరక్షించడానికి దేవునూరు గుట్టలను ఎకో టూరిజం హాబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు, త్వరలోనే కూడా ఆధ్వర్యంలో డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడిస్తూ, పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవడంతో పాటు అటవీ భూమిని కాపాడుతనని తెలిపారు.