calender_icon.png 21 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ రైతు కుటుంబం

21-09-2025 12:19:22 AM

  ఆ కుటుంబానికి మొత్తం ఏడాదంతా వ్యవసాయమే.. ఉన్న పదెకరాల పోడు భూముల్లో పలు రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకున్న భూమిలోనే ఆ గిరిజన కుటుంబం పంటలను పండిస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎక్కడికో వెళ్లి జీతాలకు పని చేయడం కంటే వ్యవసాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని చెబుతున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు.. లాభాల పండు అని ఆ కుటుంబం నిరూపిస్తున్నది. వ్యవసాయాన్ని ఆ గిరిజన రైతు కుటుంబం అబ్బురమనిపిస్తున్నది. తక్కువ పెట్టుబడితోనే తమకు ఉన్న భూమిలో ప్రధాన, అంతర పంటలు సాగుచేస్తూ అధిక లాభాలు గడిస్తూ అందరికీ మార్గదర్శి అవుతున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు గ్రామంలో ఓరైతు కుటుంబం ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఆ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు నిత్యం వ్యవసాయమే ప్రధానంగా భావించి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇరుప వెంకట్రావు, ఆయన భార్య చిట్టెమ్మ, కుమారులు ఇరప అర్జున్, అతని భార్య కళావతి కలిసి సుమారు 10 ఎకరాల పోడు భూమిలో మిశ్రమ పంటలను పండిస్తున్నారు.

సుమారు ఐదు ఎకరాల్లో పామాయిల్ మొక్కలను వేసి అందులోనే మొక్కజొన్నను అంతర పంటగా పండిస్తున్నారు. మిగిలిన భూమిలో ఇక ఇప్పటికే మిర్చి నారు వేసి యాబై ఐదు రోజులు గడిచిందని పంట త్వరగా పండేందుకు ముందుగానే మిర్చి పంటను వేశామని, అలాగే వరి, పత్తి, వంటి పలు పంటలను పండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కుంటల ద్వారా చేపల పెంపకం కూడా 10 ఎకరాల వ్యవసాయ పోడు భూములోనే పంటలతోపాటు కుంట ఏర్పాటు చేసి దానిలో చేపల పెంపకం కూడా చేస్తూ వ్యవసాయానికి సాగునీరుని, చాపల పెంపకాన్ని చేస్తూ అధిక ఆదాయాన్ని పొందే విధంగా ప్రణాళిక రూపొందించారు. కుంటలో బంగారు తీగ, బొచ్చే ,వంటి చేపలను కూడా పెంపకం చేస్తున్నారు.

ఫోర్ పేస్ కరెంట్ వలనే పంటలకు నీరు

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పల్లెకు ఫోర్‌పేస్ కరెంట్ సదుపాయం ఏర్పాటు చేయడంతో రైతులు అధిక దిగుబడులను పండిస్తూ వ్యవసాయానికి సాయపడే సాగునీరు సమృద్ధిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే.. కరెంటు లేకుండా కూడా సుమారు రూ 80వేల వ్యయంతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటుచేసి తద్వారా వెంకట్రావు పంట పొలాలకు నీరు లభించేలా చక్కని ప్రణాళిక రూపొందించాడు.

మారుమూల అతి గిరిజన ఆదివాసీలు నివసించే కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు గ్రామం లో రైతులు ఆదర్శవంతమైన వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడానికి ప్రభుత్వం కూడా పలు సదుపాయాలను సబ్సిడీలను ఏర్పాటు చేస్తుందని ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పది ఎకరాల పోడు భూమిలో పలు రకాల పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్న ఈ వ్యవసాయ దంపతులు పోడు భూమి సాగు చేస్తున్న ఎర్ర బోరు గ్రామాన్నీ జిల్లా ఉన్నత అధికార యంత్రాంగం సందర్శించి ఇరుప వెంకట్రావు, చిట్టెమ్మ దంపతులను ఆదర్శ రైతులుగా ప్రభుత్వం గుర్తించేలా ఆలోచన చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. విజయక్రాంతి