21-09-2025 12:17:42 AM
-జల సవ్వడులతో పర్యాటకుల మదిని దోస్తున్న జలపాతం
-భీముని పాద ముద్రలు పోలిన ఆకారం ఉండటంతో భీముని పాదం జలపాతంగా గుర్తింపు
కనుచూపు మేరలో పుడమిపై పరుచుకున్న పచ్చదనం.. వేలాడే తీగలకు పచ్చటి ఆకులు.. పక్షుల కిలకిలారావాలు, స్వచ్ఛ్ఛమైన గాలి, జల సవ్వడితో పారే జలపాతపు సరాగాలు మనసును ఇట్టే కట్టి పడేస్తాయి. ఆ పచ్చని చెట్ల మధ్యలో మార్గం లోయలోంచి వీచే చల్లని గాలులతో పాటు వచ్చే నీటి బిందువులు మన మనసులను తడిపేస్తాయి. దాదాసు 70 అడుగుల ఎత్తు పైనుంచి పాలనురగ వలె జాలువారే ప్రకృతి సోయగం.. భీముని పాదం జలపాతం.. ప్రతి ఏటా వర్షాకాలంలో నాలుగు నెలల పాటు పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో సీతానాగరం, కొమ్ములవంచ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న భీముని పాదం జలపాతం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ కొంత కాలం గడిపినట్లు నమ్మకం. జలపాతం పైభాగంలో భీముని పాద ముద్రలు పోలిన ఆకారం ఉండటంతో భీముని పాదం జలపాతంగా పేరు గాంచింది.
ప్రకృతికి తోడు పర్యాటక శోభ
భీముని పాదం జలపాతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అటవీశాఖ చర్యలు చేపట్టింది. 54 లక్షల రూపాయల వ్యయంతో రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగం పరిధిలో ఉన్న భీముని పాదం జలపాతం ప్రాంతాన్ని పర్యాటకులకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. ప్రకృతి రమణీయతకు నిదర్శనమైన స్వాగత తోరణం, స్విమ్మింగ్ పూల్, పార్క్, జలపాతం పైన వాచ్ టవర్ ఏర్పాటు చేశారు. అలాగే భీముని పాదం జలపాతం వద్ద పర్యాటకులు సేద తీరడానికి మౌలిక సౌకర్యాలు కల్పించారు. ప్రకృతి రమణీయతకు తోడు అటవీశాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలతో భీముని పాదం జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.
ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిర్వహణ
భీముని పాదం జలపాతం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అటవీశాఖ ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించడానికి ఎకో డెవలప్మెంట్ కమిటీకి తోడుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హత్తి సింగ్ ను పర్యవేక్షకుడిగా నియమించింది. భీముని పాదం జలపాతానికి సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి ఒక్కరికి 40 రూపాయల చొప్పున ప్రవేశ రుసుం చేస్తున్నారు. జలపాతానికి వచ్చే వాహనాలకు టోకెన్ వసూలు చేస్తున్నారు. పర్యాటకుల నుంచి వసూలు చేసిన రుసుముతో పర్యాటక అభివృద్ధి, నిర్వహణకు వినియోగిస్తున్నారు. రోజురోజుకు పర్యాటకుల సంరక్షణ పెరుగుతుండడంతో భీముని పాదం వద్ద అటవీశాఖ మరిన్ని మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తోంది.
జలపాతానికి ఇలా చేరుకోవచ్చు
భీముని పాదం జలపాతం వరంగల్ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలో నుంచి వరంగల్ వరకు రైలు, బస్సు మార్గాలు ఉన్నాయి. వరంగల్ నుంచి నర్సంపేట, మహబూబాబాద్ జాతీయ రహదారిపై భూపతి పేట వద్ద నుంచి సీతానగరం శివారు కొమ్ములవంచ మీదుగా చేరుకోవచ్చు. అలాగే మహబూబాబాద్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు గూడూరు నుంచి చంద్రు గూడెం, లైన్ తండా మీదుగా మరో మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి రావడానికి కొత్తగూడ మండల కేంద్రం నుంచి పోలారం, భత్తులపల్లి, గోపాలపురం మీదుగా భీముని పాదం జలపాతానికి చేరుకోవచ్చు.
- బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి