21-09-2025 12:22:36 AM
కళ్యాణీ చాళుక్యుల కాలంలో కొంతకాలం వరకు జైనమత పోషణకు రాజాశ్రయం లభించింది. తర్వాత కాలంలో కొందరు కళ్యాణీ చాళుక్య చక్రవర్తులు శైవమతస్తులై కాలాముఖాచార్యుల మా ర్గదర్శకత్వంలో పాలించారు. ఇరుమతాలకై రాజులు బసదులు, మఠాలు నిర్మించారు. దానాలు చేసి, శాసనాలు వేశా రు. చాలాకాలం వరకు పశ్చిమ చాళుక్యులకు నిశ్చిత రాజధాని లేదు. ఎక్కువ కాలం కొలనుపాక రాజధానిగా వుండేది. తరుచుగా తాత్కాలిక నెలవులు, నెలవీడులైన పటాన్‌చెరు, కొలనుపాక, కళ్యాణీలలో రాజులు నివాసముండేవారు.
చాళుక్యరాజు జగదేకమల్లుడు(జయసింహుడు) పటాన్‌చెరులో ఎక్కువకాలం నివసించాడు. తన రాజకార్యాలన్నీ ఇక్కడ నుండే నిర్వహించేవాడు. తన కాలంలో ఆలేటి కంపణంలోని దిగంబర జైన కేంద్రమైన ఇక్కుర్తిలో వైద్య రత్నాకర జినాలయం, సమీపగ్రామం ముచ్చెనపల్లి(ప్రస్తుతం ముస్త్యాలపల్లి)లో బుద్ధసేన జినాలయం నిర్మాణ పునరుద్ధరణలకు ముచ్చెనపల్లి గావుం డా నరవైద్యవర, శస్త్రశాస్త్రకుశలుడైన వైద్యుడు, జైనగురువు అగ్గలయ్యకు దానం చేసినట్లు తెలిపే శాసనాలు రెండు -భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో వున్నాయి. ఈ శాసనాలు అగ్గలయ్య వైద్యప్రతిభ ను సవివరంగా తెలియజేస్తున్నాయి.
అశక్యవ్యాధులను నిర్మూలించేవాడని, నాటి వైద్యశాస్త్రాలను చదివిన వి ద్యాపా రంగతుడని, నిరూహదక్ష, పునరూ హదక్ష అనే వైద్యవిధానాలలో నిష్ణాతుడని ఈ శాసనాలవల్ల బోధపడుతున్నది. సైదాపురంలో ఈ శాసనాలలో ఒకటి జైన మానస్తంభం మీద, మరొకటి పొలాల్లో వున్న రాతికంభం మీద కనిపిస్తున్నాయి. జైన మానస్తంభం వున్న చోట మట్టికోట ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆ ప్రాంతంలోనే ఇటుకల పునాది బయటపడ్డదని గ్రామస్థులు తెలిపారు. శాసనస్తంభం వున్నచోటనే 3 సింహాలు చెక్కి వున్న జైనతీర్థంకరుడు మహావీరుని అధిష్టానపీఠం పడివున్నది.
మహావీరుని విగ్రహం లేదు. ఇటీవల ఒకప్పటి నా టీచర్ కొలీగ్ ఫరీద్ సార్ మనవడు, ఫొటో జర్నలిస్టు అజహర్ షేక్ ఆ పరిసరాల్లో లభించిన మహావీరుడి విగ్రహం శిరస్సు ఫొటో పంపించాడు. జై నమానస్తంభం, జైనతీర్థంకరుని అధి ష్టానపీఠం, విగ్రహశకలాలు అక్కడ ఒకప్పుడు జైనబసది వుండేదని తెలిపే మౌనసాక్ష్యాలు. వాటిని పరిరక్షించే ఏర్పాటు చేస్తే అపూర్వమైన అగ్గలయ్య శాసనాలు భద్రంగా వుంటాయి. గొప్ప చరిత్ర మిగులుతుంది.