calender_icon.png 21 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు నిర్వహించకపోతే చాంబర్‌లోనే కూర్చుంటాం

21-09-2025 01:08:05 AM

ఫిల్మ్‌చాంబర్ వద్ద ధర్నాలో నిర్మాతల హెచ్చరిక lసినిమా కార్మికుల చిత్రపురి భూమి పరిరక్షణ కోసం చట్టబద్ధమైన పోరాటం

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీలకు వెంటనే ఎన్నిక లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతలు ఆందోళనకు దిగారు. ఫిల్మ్ చాంబర్ వద్ద శనివారం చేపట్టిన ఈ ధర్నాలో ఇండస్ట్రీకి చెందిన వివిధ విభాగాలకు చెందినవారు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడారు. “ఇండస్ట్రీని రోడ్డు మీదకు తీసుకురావడం దుర్మార్గం. ఏ నిర్ణయమైనా ఫిల్మ్ చాంబర్ ద్వారానే జరుగుతుంది. అలాంటి చాంబర్ కమిటీకి రెండేళ్లకోసారి ఎన్నికలు తప్పనిసరి జరగాలి.

కానీ, ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులు పదవుల్లో తామే కొనసాగుతామంటున్నారు. ఇది న్యాయం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నవారిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. ఆయన అప్పుడు అధ్యక్ష కార్యదర్శులకు ఫోన్ చేస్తే ‘ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం.. తర్వాత వచ్చి కలుస్తాం’ అని మంత్రికి చెప్పారు.. ఇప్పటికీ వాళ్లు మంత్రిని కలిసిందే లేదు. ఎన్నికల విషయం, ఇతర సమస్యల గురించి చర్చించేందుకు ఎవరైనా నిర్మాతలు చాంబర్‌కు వెళ్తే వారు అక్కడ అందుబాటులో ఉండట్లేదు.

మేం ఛాంబర్ నుంచి తిరిగివెళ్లిపోయామని సమాచారం అందిన తర్వాతే వాళ్లు ఛాంబర్‌కు వస్తున్నారు. ఇలా మాకూ అందు బాటులోకి రాక, మంత్రి పిలిచినా వెళ్లకుండా ఉండటంలో ఉద్దేశం ఏమిటి? పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మేమే కొనసాగుతామంటే కుదరదు. అధికారంలో ఉన్నవాళ్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఎలా? పదవీకాలంలోనే కేటాయించిన కుర్చీలో కూర్చోవాలి. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చునే అధికారం ఎవరికీ లేదు. ఇప్పటికై నా ఎన్నికలు నిర్వహించండి. లేకపోతే రోజూ ఛాంబర్‌కు వచ్చి మేమూ అక్కడే కూర్చుం టాం. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకొని చాంబర్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి” అన్నారు.

కార్మిక నాయకులు మా ట్లాడుతూ తమ డిమాండ్లను వివరించారు. ప్రస్తుత ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, మరికొందరు పెద్దలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు కేటాయించిన చిత్రపురి భూమిలో ఫ్లాట్లను నిర్మించి, అమ్ముకోజూస్తున్నారని ఆరోపించారు. చిత్రపురి కమిటీని రద్దు చేయకుండా, ఆ భూమిలో కార్మికుల కోసమే ఇళ్లు నిర్మించాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతు న్న ప్రస్తుత చిత్రపురి కమిటీని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చిత్రపరిశ్రమకు సంబంధించి 24 సంఘాల కు చెందిన కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.