29-08-2025 05:57:41 AM
‘ఇండియా టుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేంద్రంలో ఎన్డీయే కూటమి హవా కొంత మేర తగ్గినా కానీ అధికారం కైవసం చేసుకోనున్నారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రికార్డు స్థాయిలో 324 సీట్లు గెలచుకుంటుందని ఇండియా టుడే-సీ వోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 234 ఎంపీ సీట్లు గెల్చుకుని ప్రతిపక్ష హోదా పొందిన ఇండియా కూటమి బలం 208కి పడిపోనుందని సర్వేలో తేలింది.
ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో నిర్వహిం చారు. సర్వే సందర్భంగా మొత్తం 54,788 మంది అభిప్రాయాలు స్వీకరించడంతో పాటుగా సీ వోటర్ రెగ్యులర్ ట్రాకర్ డాటా నుంచి 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా పరిశీలించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు లభించలేదు.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 272 ఎంపీ సీట్లు అవసరం కాగా.. ఆనాటి ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే లభించాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సంఖ్యకు బీజేపీ 32 సీట్ల దూరంలో నిలిచి.. కూటమి సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి మద్దతుతో ఎంపీల సంఖ్య 293కు చేరుకుంది. దీంతో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది.
బీజేపీకి 260 ఎంపీ సీట్లు
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా బీజేపీకి సొంతంగా 260 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో లభించిన సీట్లతో పోల్చుకుంటే ఈ సంఖ్య కాస్త ఎక్కువే. ఫిబ్రవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో బీజేపీకి 281 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఎన్డీయే కూటమి బలం కూడా 343 నుంచి 324కి తగ్గడం గమనార్హం. ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్య పెరగడం గమనార్హం.
ఫిబ్రవరి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 78 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయగా.. ఇప్పడు ఆ సంఖ్య 97కు చేరుకుంది. ఇండియా కూటమి బలం కూడా 188 నుంచి 204కు పెరిగింది. అధికార పక్షంపై ‘ఓట్ చోరీ’ ఆరోపణలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ కొంత మేర ప్రయోజనం పొందినట్టే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 46.7 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.9 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.