calender_icon.png 29 August, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత ఉనోళ్లు అవతలకు..

29-08-2025 04:29:44 AM

  1. ఉద్యాన పంటల వృద్ధికి ఔట్ సోర్సింగ్ విధానంలో హెచ్‌ఈఓల ఏర్పాటు
  2. కరోనా సమయంలో విధుల నుండి తొలగింపు.                      
  3. ప్రస్తుతం తిరిగి నియామకం    
  4. గతంలో ఉమ్మడి జిల్లాలో 31 మంది, ఇప్పుడు 19 మందే..      
  5. 12 మంది హెచ్‌ఈఓలు పక్కా 
  6. జిల్లాలకు డిప్లొమో చేసినోళ్లు అవతలి జిల్లాలకు..
  7. సాధారణ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సు చేసినోళ్లు ఉమ్మడి నల్లగొండకు..                 
  8. ఏ ప్రాతిపదికన వేరే జిల్లాలకు పంపారంటున్న డిప్లమో హోల్డర్‌లు 
  9. సమాధానం చెప్పని హార్టికల్చర్ ఉన్నతాధికారులు    

సూర్యాపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఉద్యాన పంటల సాగు ద్వారా త్వరగా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చనే సంకల్పంతో ప్రభుత్వం వాటిని ప్రోత్సహించేందుకు గాను ఉద్యాన విస్తరణాధికారులను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంతో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 175 మంది ఉద్యాన విస్తరణాధికారులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించింది.

వారి కృషి ఫలితంగానే రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపారు. అయితే కరోనా సమయంలో వారిని విధుల నుండి తొలగించారు. ప్రస్తుత ప్రభుత్వం పామాయిల్ తో పాటు ఇతర ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు తిరిగి ఈ నెల 11న వారందరినీ విధులలోకి తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 31 మంది హెచ్‌ఈవోలు ఉండగా, ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు 19 మంది హెచ్‌ఈఓ లను మాత్రమే తీసుకుంది.

(నల్లగొండ 11, సూర్యాపేటకు 8) మిగిలిన 12 మందిని ఉమ్మడి ఖమ్మం, మహబూబాద్ జిల్లాలకు పంపించింది. అక్కడే అసలు సమస్య మొదలైంది. డిప్లమో చేసినోళ్ళను ఇతర జిల్లాలకు: ప్రభుత్వం హెచ్ ఓ లను వెనుకకు తీసుకోగా విస్తీర్ణం తక్కువగా ఉందన్న కారణంతో మొత్తం 31 మందిలలో 19 మందిని ఈ జిల్లాలో ఉంచి 12 మంది వచ్చిఓ లను వేరే జిల్లాలకు పంపింది. అయితే ఈ 12 మందిని వేరే చోటకు పంపడానికి దీనిని ప్రాతిపదికన చేసుకున్నారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత  లేకపోవడం గమనార్హం.

అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఖమ్మం మహబూబాద్ జిల్లాలకు పంపిన వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా హార్టికల్చర్ డిప్లమో పూర్తిచేసిన వారే ఉండడం గమనించదగ్గ విషయం. అలాగే ప్రస్తుతం నల్గొండ జిల్లాకు కేటాయించిన మొత్తం 11 మంది, సూర్యాపేట జిల్లాకు కేటాయించిన ఎనిమిది మందిలో ఆరుగురు సాధారణ డిగ్రీ, కేవలం సర్టిఫికెట్ కోర్స్ మాత్రమే చేయడం, అన్నామలై యూనివర్సిటీ తమిళనాడు రాష్ట్రంలో దూరవిద్య విధానాల్లో చదివిన వారు ఉన్నారంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే పూర్తిస్థాయి అర్హతలు ఉన్న వారిని ఇతర జిల్లాలకు పంపించడం ఏంటి అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.

 సమాధానం చెప్పని ఉన్నతాధికారులు

ఇదిలా ఉండగా ఔట్ సోర్సింగ్ విధానంలో హెచ్డి రూ.23,500ల వేతనం ఇస్తారు. దీంతో సొంత జిల్లాలో పనిచేస్తే ఏ ఇబ్బంది ఉండదని ఆలోచనతో వారు విధులు నిర్వహించారు. ఈ వేతనంతో కుటుంబాన్ని, వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి వేరే జిల్లాకు వెళ్లి ఎలా విధులు నిర్వహిస్తామంటూ అక్కడికి వెళ్లాల్సిన హెచ్‌ఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే అన్ని అర్హతలు ఉన్నా తమను ఇతర జిల్లాలకు పంపుతూ సాధారణ డిగ్రీ, కేవలం ఐదు రోజుల సర్టిఫికెట్ కోర్సు చేసిన వారిని ఇక్కడే ఉంచడం ఏ ప్రాతిపదికన చేశారంటూ ఆర్టికల్చర్ ఉన్నతాధికారులను ప్రశ్నించగా వారి నుండి ఎటువంటి సమాధానం రావడం లేదంటూ తన బాధను ఇతర జిల్లాలకు వెళ్లిన హెచ్ ఈ వోలు తమ సన్నిహితుల వద్ద  వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకొని అన్ని అర్హతలు ఉన్నా తమను ఉమ్మడి నల్లగొండ జిల్లాకే కేటాయించి ఈ జిల్లా లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.                       

ఏ ప్రాతిపదికన పంపారో చెప్పాలి                           

ఏ విధానంలో గతంలో ఉమ్మడి జిల్లాలో పనిచేసిన హెచ్‌ఈఓలను ఇతర జిల్లాలకు పంపార అనేది తెలీదు. ఈ విషయంపై ఈనెల 13న హార్టికల్చర్ డైరెక్టర్, కమీషనర్ యాస్మిన్ భాషను కలిసి అడిగిన ఫలితం లేకుండా పోయింది. అసలు పద్ధతి అనేది లేకుండా తమకు అనుకూలమైన వారిని సొంత జిల్లాలో ఉంచి ఇతరులను వేరే జిల్లాలకు పంపారు.

మరీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 12 మంది హెచ్‌ఈఓ లను ఖమ్మం, మహబూబాబాద్ కు పంపగా అందులో 10 మంది ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన కళాశాలలో హార్టికల్చర్ డిప్లమో పూర్తి చేసిన వారు ఉండడం గుర్తించాల్సిన విషయం.

హార్టికల్చర్ అధికారులు అనుసరించిన ఈ విధానంతో అటు డిప్లమో కోర్సు పూర్తి చేసిన వారితో పాటు, ఇటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతులకు అన్యాయం జరుగుతుంది. కావున ప్రభుత్వ పెద్దలు, హార్టికల్చర్ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అన్ని అర్హతలు ఉన్న వారిని సొంత జిల్లాలో ఉంచి, ఆ జిల్లాకు చెందిన రైతులకు తగు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం.

 సుందరి సురేష్,

ఉద్యాన డిప్లమో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు,

తెలంగాణ