29-08-2025 04:52:17 AM
* షెల్ కంపెనీల గురించి విని ఉంటాం. వాటి గురించి చదివుంటాం.. కానీ షెల్ పార్టీల గురించి ఎప్పుడైనా విన్నారా.. షెల్ పార్టీలు అనే పదం డిక్షనరీలో లేకపోయినా, కొన్ని పార్టీలు వ్యవహరించే తీరు షెల్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే షెల్ కంపెనీలే చిన్నబోయేలా అవి ‘చారానా ఖర్చు చేస్తూ.. బారానా లెక్క చూపుతున్నాయి.’ సువిశాల భారత్‌లో ఇటువంటి పార్టీలకు కొదువే లేకుండా పోయింది. వేలల్లో ఉన్న ఈ పార్టీల గురించి వివరాల్లోకి వెళితే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి..
వీజేఎం దివాకర్ :
గుజరాత్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలకు వేలాది రూపాయల నిధులు విరా ళాలుగా సమకూరాయి. ఇందులో తప్పు లేకపోయినా ఆ నిధులను ఆ పార్టీలు ఖర్చు చేసిన విధానం, వాటికి లెక్కలు చెప్పిన విధానం చూస్తేనే ఆశ్చర్యం కలగక మానదు. అన్ని గుర్తింపులు ఉన్న పార్టీలకు నిధులు విరాళాలుగా వచ్చాయంటే ఏమో అనుకోవచ్చు కానీ ఎటు వంటి గుర్తింపులేని పార్టీలకు ఇంత మొత్తంలో నిధులు రావడం ఎవరూ ఊహించలేరు. కొన్ని పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను కూడా నిలబెట్టడం గమనార్హం. అభ్యర్థులను నిలిపినా.. వారికి పెద్దగా ఓట్లు రాకపోవడం ఇక్కడ మరో ట్విస్ట్.
అన్ని కోట్ల నిధులా..!
ఇటువంటి రాజకీయ పార్టీలకు వచ్చి న విరాళాలను చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. 2019-20 నుంచి 2023 -24 మధ్య ఈ షెల్ పార్టీలకు రూ. 4300 కోట్ల విరాళాలు వచ్చినట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠను ఇటువంటి పార్టీలు సవాల్ చేస్తున్నాయి. ఈసీ ప్రతిష్ఠను కూడా దిగజార్చుతున్నాయి.
కొంత మంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా తెలియని ఈ రాజకీయ పార్టీల ద్వారా నిధులను సమకూర్చుకుంటూ ఎన్నికల ఖర్చు పరిమితులను అధిగమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పార్టీలు ఎవరికీ తెలియకపోయినా ఇంత మొత్తంలో నిధులు రావడం అనేదానిపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీల ముసుగులో చేస్తున్న అతిపెద్ద నేరం అని దీనిపై విచారణ జరపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెతాయి.
గుజరాత్‌లో బయటపడ్డ ‘షెల్’ పార్టీలు
ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించిన విషయాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలో పది రిజిస్టర్ట్ అన్‌ఆర్గనైజ్‌డ్ పొలిటికల్ పార్టీ లు (ఆర్‌యూపీపీ) ఉన్నట్టు తేలింది. స్థుప్తచేతనావస్థలో ఉన్న ఈ రాజకీయ పార్టీలకు 2019 మధ్య కాలంలో రూ. 4,300 కోట్ల విరాళాలు అందాయి. 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ సమయంలోనే జరగడం గమనార్హం.
లోక్‌షాహి సత్తా పార్టీ, భారతీయ నేషనల్ జనతాదళ్, స్వతంత్య్ర అభివ్యక్తి పార్టీ, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ, సత్యవాది రక్షక్ పార్టీ, భారతీయ జనపరిషత్, సౌరాష్ట్ర జనతా పక్ష్, జన్ మన్ పార్టీ, మానవాధికార్ నేషనల్ పార్టీ, గరీబ్ కల్యాణ్ పార్టీ పేర్లతో ఉన్న ఈ పార్టీలు ఈ మూడు ఎన్నికల్లో కలిసి 43 మంది అభ్యర్థులను మాత్రమే పోటీలో నిలిపాయి. అయితే ఈ అభ్యర్థులకు కేవలం 54,069 ఓట్లు మాత్రమే పోల్ అవడం గమనార్హం.
గుజరాత్‌లో ఉన్న ఓటర్లతో పోల్చుకుంటే ఈ ఓట్లు చాలా తక్కువ శాతం. ఎన్నికలకు రూ. 3,500 కోట్లు ఖర్చు అయినట్టు ఈ పార్టీలు తమ ఆడిట్ రిపోర్ట్‌లో పేర్కొన్నాయి. అదే సమయంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వద్ద మాత్రం వారి ఖర్చుల వివరాలను రూ. 39.02 లక్షలుగా మాత్రమే చూపెట్టాయి. భారీ స్థాయిలో ఉన్న ఈ తేడా పార్టీలు తమ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును దాచేందుకు చేస్తున్న పనేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లోక్షాహి సత్తానే ఉదాహరణ..
ఇలాంటి ఆరోపణలకు లోక్షాహి సత్తా పార్టీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సమర్పిం చిన నివేదిక ప్రకారం చూసుకున్నట్టయితే సదరు పార్టీకి రూ. 1,045 కోట్ల విరాళాలు డొనేషన్ల రూపంలో రాగా.. అదే సమ యంలో ఆ పార్టీ ఎన్నికల్లో రూ. 1,031 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కచూపింది. ఇంత భారీగా ఆర్థిక కార్యకలాపాలు ఉన్నా ఆ పార్టీ ఎన్నికల్లో కేవలం నలుగురు అభ్యర్థులను మాత్ర మే పోటీలో నిలిపింది.
పార్టీ పోటీకి దించిన నలుగురు అభ్యర్థులకు అందరికి కలిపి 3,997 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ పార్టీ ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాల్లో మాత్రం ఒక్కో అభ్యర్థికి సగటున రూ. 2.27 లక్షలు మాత్ర మే ఖర్చు చేసినట్టు పేర్కొంది. అంటే నలుగురు అభ్యర్థులకు కలిపి రూ. 9.08 లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ విలువకు పార్టీ ఆడిటింగ్‌లో తేలిన విలువకు అసలు పొంత నే లేదు.
మరి ఆ పార్టీ లెక్కలో చూపిన మిగ తా డబ్బులు ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావడం సహజం. ఎన్నికల సంఘం నియమాల నుంచి తప్పించుకునేందుకే రాజకీయ పార్టీలు ఇలాంటి ఊరూ, పేరు లేని రాజకీయ పార్టీలను స్థాపిస్తాయని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రూ. 50 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాలనే షరతు విధించింది. ఈ పరిమితులను తప్పించుకునేందుకే రాజకీయ పార్టీలు ఇలా ఊరూ, పేరు లేని పార్టీలను తెర మీదకి తెస్తాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. మన దేశంలో ఎన్నికల సంఘంలో ఉన్న లొసుగులను ఇవి ఎత్తి చూపుతున్నాయి.
ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులపై పరిమితులు విధిస్తుంది కానీ రాజకీయ పార్టీలు చేసే ఖర్చులపై ఎటువంటి పరిమితులు విధించదు. దీన్నే పలు పార్టీలు అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఊరూ, పేరు లేని రాజకీయ పార్టీలను నెలకొల్పి దందాలు కొనసాగిస్తున్నాయి. పెద్ద మొత్తాలను ఎటువంటి తనిఖీలు లేకుండా రాజకీయ పార్టీల అకౌంట్లకు అనుమతిస్తుం ది. ‘ఇండియా టుడే’ 2018లో ఇచ్చిన నివేదిక మన దేశంలో ఎన్నికల ఖర్చుకు నల్లధనా న్ని విరివిగా ఉపయోగిస్తున్నారని అభియోగాలు మోపింది.
2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ఎంపీ ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్టు అంగీకరించాడు. ఇది ఈసీ అనుమతించిన పరిమితి కంటే చాలా ఎక్కు వ. కానీ ఎన్నికల కమిషన్ నివేదికలు మాత్రం అభ్యర్థులు విధించిన పరిమితిలో కేవలం 25 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఖర్చు రూ. 25 లక్షలుగా ఉంది.
ఎన్నికల బాండ్లతోనే ఇదంతా!
రాజకీయ పార్టీలకు సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ఎన్నికల బాండ్ల విధానాన్ని ఎన్డీయే తీసుకొచ్చింది. ఈ విధానంలో విరాళం ఇచ్చే వారి వివరాలు చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. 2024లో సుప్రీం కోర్టు ఈ ఎన్నికల బాండ్లను రద్దు చేసింది. ఈ బాండ్లు రాజ్యాంగానికి విరుద్ధం అని పేర్కొంది. ఈ బాండ్లపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ బాండ్ల వల్లే ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారనే వివరాలు తెలియకుండా పోయా యి.
కొన్ని రాజకీయ పార్టీలు ఈ బాండ్లను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా దీనిని గుర్తించారు. గుజరాత్‌లో 4,000 మంది పన్ను చెల్లింపుదారులు ఆర్‌యూపీపీ లకు విరాళాలు ఇచ్చామని ఆదాయపు పన్ను శాఖ వద్ద మినహాయింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని 2022లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేయగా.. ఆనాడు 23 గుర్తింపు లేని పార్టీలు ఈ రాకెట్‌లో ఉన్నట్టు అనేక మంది వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్టు తేలింది. పలువురు చార్టెడ్ అకౌంటెంట్లు, సంస్థలు ఈ విధంగా అక్రమాలు చేసుకుంటూ కమిషన్లు తీసుకుంటున్నట్టు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘అప్నా దేశ్ పార్టీ’ కేసులో ఇదే విధంగా జరిగింది. మోసపూరిత విరాళాల కోసం పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు.
23 రాష్ట్రాల నుంచి విరాళాలు
ఈ రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా ఉన్న 23 రాష్ట్రాల నుంచి విరా ళాల రూపంలో నిధులు అందుతున్నాయని ‘దైనిక్ బాస్కర్’ గుర్తించింది. భారతీయ జనపరిషత్ రూ.177 కోట్లు, సౌరాష్ట్ర జనతా పార్టీ రూ. 141 కోట్ల మేర ఎన్నికల ఖర్చుగా ఆడిట్ రిపోర్ట్ లో చూపాయి. మానవాధికార్ నేషన ల్ పార్టీ వంటి కొన్ని పార్టీలు తమ లెక్కలను ఎన్నికల సంఘానికి నివేదించడంలో విఫలం అయ్యాయి.
2023 లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దర్యాప్తులో తేలిన విషయం ఈ ఆర్‌యూపీపీల అరాచకాలను కళ్లకు కట్టింది. గుజరాత్‌లోని కొన్ని ఆర్‌యూపీపీలు విరా ళాలకు సంబంధించి బోగస్ రశీదుల ను జారీ చేసింది. దీంతో ఆదాయ పన్ను శాఖకు కూడా ఈ పార్టీలు నష్టం చేకూర్చాయి. ఇటువంటి పార్టీలకు పెద్ద ఎత్తున షెల్ కంపెనీలు నిధులను మళ్లిస్తున్నాయి. ఈ పార్టీలు విరాళాల నివేదికలను ఆదాయపు పన్ను శాఖకు సకాలంలో దాఖలు చేయడంలో విఫ లం అయ్యాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 13ఏ కింద పన్ను మినహాయింపులను పొందేందుకు ఇవి అవసరం.
దర్యాప్తు చేయండి: రాహుల్ గాంధీ
ఇటువంటి రాజకీయ పార్టీల విరాళాలపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయా లని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆగస్టు 27న ఎక్స్‌లో ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.
* ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
* ఆ పార్టీలను ఎవరు నడుపుతున్నారు?
* ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి?
రాహుల్ గాంధీ ఓట్ చోరీపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదా క్షమాపణ చెప్పాలని ఈసీఐ రాహుల్‌ను ఆదే శించింది. దాని తర్వాత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం సమస్యను దర్యాప్తు చేయకుండా అఫిడవిట్ డిమాండ్ చేస్తుందని ఆరోపించారు.
స్పందించని ఈసీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు. రాజకీయ పార్టీల విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన విరాళాలు యుద్ధప్రాతిపదికన సమర్పించాలని కోరింది. భారతదేశంలో ప్రస్తుతం 3,000 వరకు ఆర్‌యూపీపీలు ఉన్నా యి. ఇంత పెద్ద సంఖ్యలో ఈ పార్టీలు ఉండటం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
నిబంధనలను అతిక్రమిస్తున్న ఇటువంటి పార్టీలను కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు విధించాలని పలువురు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్లు కోరుతున్నా రు. ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించని ఈ పార్టీలు ప్రజాశ్రేయస్సు కోసమే ప ని చేస్తున్నాయా? లేక ప్రజాస్వామ్యం ము సుగులో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు చే స్తున్నాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంలో ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.