29-08-2025 05:03:32 AM
కామారెడ్డి జిల్లా కకావికలం
రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 44 సెం.మీ.ల వర్షపాతం
ఉత్తర తెలంగాణ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. వరద బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షానికి, వరదలకు జనం విలవిలలాడారు. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతు ప్రమాదస్థాయికి చేరాయి. దీంతో రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్నది. కామారెడ్డి జిల్లాలో చరిత్రలోనే 50 ఏళ్లలో కనీవిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి చెరువులో చిక్కుకున్న ముగ్గురిని బుధవారం అర్ధరాత్రి రెస్క్యూ టీం బోటు ద్వారా రక్షించింది. కట్టేసిన ఆవులను తీసుకువచ్చేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు పాల్వంచ వాగులో చిక్కుకోగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. కామారెడ్డి సరంపల్లి వద్ద గల రెసిడెన్షియల్ పాఠశాలలోని 300 మంది విద్యార్థులు వరదలో చిక్కుకోగా వారిని పోలీసులు సురక్షి తంగా బయటకు తీసుకువచ్చారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలకేంద్రంలో వరద ఉధృతికి గోడ కూలి వైద్యుడు మృతిచెందాడు. కామారెడ్డి, దోమకొండ మండలా ల్లో వాగులో చిక్కుకుని ఇద్దరు మృతిచెందారు. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలా కుతలం అయింది. రెండురోజులుగా జిల్లా లో పలు ప్రాంతాల్లో 30 సెం.మీ.ల వర్షం కురిసింది. పలు గ్రామాలు, కాలనీలు నీట మునిగాయి. వాగులో చిక్కుకుని ఒకరు మృ తిచెందగా.. ఒకరు గల్లంతయ్యారు.
రామాయంపేట పట్టణంలోని గురుకుల మహిళా కళాశాలలోకి వరద నీరు చేరడంతో పోలీసులు సుమారు 300 మంది విద్యార్థినుల ను సురక్షితంగా తరలించారు. మెదక్ జిల్లాలో 513 ఇండ్లు ధ్వంసమయ్యాయి. కాగా కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరద ముంచెత్తడంతో గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టులో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో సైనిక హెలికాప్లర్ల ద్వారా రక్షించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. లక్ష్మణ చందా మండలంలో వరదనీటిలో చిక్కుకున్న ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదల వల్ల వేలాది ఎకరాలకు పంట నష్టం జరిగింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 40 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలడంతో మంచిర్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి, బిక్కేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 12,413 ఎకరాలలో ఇసుక మేటలు వేశాయి. 60 కరెంటు స్తంభాలు నేల కూలాయి. పునరావాస కేంద్రాలకు 164 కుటుంబాలను తరలించారు. భద్రాచలం వద్ద గోదావరి నది 38 అడుగులకు చేరుకుంది. కాగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తడంతో 26గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
ముంచెతైన వాన
మెదక్ జిల్లాలో 30 సెం.మీ.ల వర్షం
మెదక్, ఆగస్టు 28 (విజయక్రాంతి): భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అయింది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో మెతుకుసీమ జలమయమైంది. పలు గ్రామాలు, కాలనీలు నీట మునిగాయి. వాగులు, చెరువులు కట్టలు తెగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల్లో ఇద్దరు గల్లంతుకాగా ఒకరి మృ తదేహం లభించింది. జిల్లాలోని మెదక్, హవేళీఘణపూర్, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్, పాపన్న పేట, రేగోడు మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రం ఉంది. జిల్లాలో 20 మండలాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు మెదక్ జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
జలమయమైన దూప్‌సింగ్ తండా
హవేళీఘణపూర్ మండలం దూప్‌సింగ్ తండా పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. తండాకు చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు చేరి ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల స్లాబులపై నిలబడి సహాయం కోసం ఎదురుచూశారు. మరికొందరు అక్కడే ఉన్న గుట్టపైకి వెళ్లి తలదాచుకున్నారు. బుధవారం రాత్రంతా అక్కడే గడిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి నుంచి వచ్చే వరద వల్ల దూప్‌సింగ్ తండాను ముంచెత్తింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, గ్రామస్తుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలాగే హవేళీఘణపూర్ నుంచి ఎల్లారెడ్డి వెళ్లే రహదారిలో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ కారు రోడ్డు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న ఓ వ్యక్తిని కాపాడినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హవేళీఘణపూర్ చెరువు గండిపడి భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. తిమ్మాయిపల్లి చెరువు పొంగుతున్నది. దీంతో గ్రామం నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
విద్యార్థినులను కాపాడిన రెస్క్యూ టీం
రామాయంపేట పట్టణంలోని గురుకుల మహిళా కళాశాలలోకి వరద నీరు చేరడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సుమారు 300 మంది విద్యార్థినులను సురక్షితంగా తరలించారు. అలాగే పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
రెండు గ్రామాల ప్రజల తరలింపు
మెదక్ జిల్లా సరిహద్దు, కామారెడ్డి జిల్లా పరిధిలోని పోచారం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తివేశారు. అయినప్పటికీ ప్రాజెక్టు పైనుండి నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాదస్థాయికి చేరింది. కట్ట కింద మట్టి కొట్టుకుపోవడంతో సర్దన, జక్కన్నపేట గ్రామాల ప్రజలను మెదక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరా వాస కేంద్రాలకు తరలించారు. సర్దన గ్రామం నుంచి 650కి పైగా కుటుంబాలను మెదక్ పునరావాసా కేంద్రానికి తరలించారు. లింగసానిపల్లి గ్రామం నుండి 8 కుటుంబాలను మెదక్ తరలించారు.
నీట మునిగిన ఎన్‌హెచ్
భారీ వర్షాల నేపథ్యంలో కాశ్మీర్ జాతీయ రహదారి 44పై వరద నీరు ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా నార్సింగి వద్ద రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ఇరువైపులా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అంతేగాకుండా కామారెడ్డి జిల్లా భిక్కనూరు - తలమడ్ల సెక్షన్, మెదక్ - అక్కన్నపేట సెక్ష న్‌లలో రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.
మెదక్ పట్టణ శివారు మంభోజిపల్లి శివారులోని పుసులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పట్టణ ప్రజలు వాగులో వరద నీటి ప్రవాహాన్ని చూడడానికి తరలివచ్చారు. అంతేకాకుండా పట్టణంలోని గాంధీనగర్, ఆటోనగర్ కాలనీలలో వరద నీరు ప్రవహించి ఇండ్లలోకి, దుకాణాలలోకి నీరు చేరింది. పట్టణంలోని డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో భారీ వర్షాలకు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించడంతో పట్టణంలోని ప్రధాన రహదారులపై రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
అలాగే రామాయంపేట మండలంలో పలు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టులు, రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు స్తంభించాయి. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుండి మంజీరా నది ప్రవహిస్తుండడంతో పోలీసులు, అధికారులు పూర్తిస్థాయిలో రాకపోకలు బంద్ చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించి వరద నీరంతా పిల్లకొటాల్ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముంచెత్తింది. దీంతో బుధవారం నుంచి విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. రెండు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో పలు గ్రామాలు కొట్టమిట్టాడాయి. గురువారం వరద ఉధృతి తగ్గడంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
జలదిగ్బంధంలో ఏడుపాయల
పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం పూర్తిగా జలదిగ్భంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు అధికంగా రావడంతో సింగూరులో నాలుగు గేట్లను ఎత్తివేశారు. దీంతో వరద నీరు భారీగా ఘణపురం ప్రాజెక్టుకు చేరుకోవడంతో ఏడుపాయల ఆలయం పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గత 12 రోజులుగా ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న విషయం తెలిసిందే.
ధ్వంసమైన 513 ఇండ్లు
మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి తెలిపిన వివరాల ప్రకారం అతి భారీ వర్షానికి జిల్లాలో 513 పాక్షికంగా ఇండ్లు దెబ్బతినగా, 40 వేల కోడి పిల్లలు మృతి చెందాయి. రెండు ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 49 రోడ్లు ధ్వంసం అయ్యాయి. 21 బ్రిడ్జిలు కూలగా, ఇద్దరు మృతి చెందారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు నీటమునిగాయి. జిల్లాలో ఎంత మేరకు పంట నష్టం జరిగిందో తెలుసుకుకేందుకు అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు.
కూతురు కోసం వెళ్లి ఇద్దరు గల్లంతు
హవేళీఘణపూర్ మండలం రాజ్‌పేటకు చెందిన సత్యనారాయణ కూతురు శంకరంపేట హాస్టల్‌లో చదువుతున్నది. వర్షాల నేపథ్యంలో ఇంటికి తీసుకురావడానికి ఆటోలో అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్‌తో కలిసి బుధవారం వెళ్లారు. అయితే వరదలకు రాజ్‌పేట వాగు కల్వర్టు కొట్టుకుపోయింది. అయినా కూడా ఆటోతో కల్వర్టు దాటే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా వాగు ఉధృతంగా పొంగడంతో ఆటోతో సహా నీటిలో కొట్టుకుపోయారు. ఓ విద్యుత్ స్తంభం ఎక్కి కొన్ని గంటల పాటు వేచిచూసినప్పటికీ సహాయం అందకపోవడంతో నీటిలో కొట్టుకుపోయారు. గ్రామస్తులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వెతుకగా సత్యనారాయణ మృతదేహం లభించింది. యాదాగౌడ్ మృతదేహం లభించలేదు.
గర్భిణిని తరలించిన ఎస్‌డీఆర్‌ఎఫ్
హవేళీఘణపురం మండలం బూర్గుపల్లికి చెందిన ఓ నిండు చూలాలికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. రాజ్‌పేట వద్ద గల కల్వర్టు వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గర్భిణిని స్ట్రెచర్ మీద అతికష్టం మీద కల్వర్టు దాటించి, అంబులెన్సులో మెదక్ తరలించారు.
అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి వివేక్
భారీ వర్షాలతో అతలాకుతలమైన మెదక్ జిల్లాలో బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరే ట్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ప్రత్యేక అధికారి డాక్టర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర శాఖల జిల్లా అధికారులతో కలిసి భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లా యంత్రాంగంతో సమీక్షనిర్వహించారు. వరద బాధితులను అన్ని విధాల ఆడుకుంటామని, వరద సహాయక చర్యలపై ఇప్పటికే కోటి రూపాయలు మంజూరు చేశామని, అత్యధిక నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 40 సంవత్సరాలలో మెదక్ జిల్లాలో ఇంత మేరకు అత్యధిక భారీ వర్షపాతం చూడలేదని మంత్రి వివేక్ అన్నారు.
వర్ష బీభత్సం
కామారెడ్డి జిల్లా కకావికలం
కామారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా లో కురుస్తున్న అతిభారీ వర్షాలకు జిల్లాలోని పలు తండాలు, గ్రామాలు, జిల్లా కేంద్రంలోని జిఎస్‌ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, విద్యానగర్, కాకతీయ నగర్, దేవి విహార్, కల్కి నగర్, బతుకమ్మ కుంట, అయ్యప్ప నగర్, రాజా కాలనీలు వరదలో మునిగాయి. అలాగే జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.
రాజంపేటలో వానకు తడిసిన గోడ కూలడంతో వైద్యుడు మృతి చెందాడు. అలాగే కామారెడ్డి, దోమకొండ మండలాల్లో వచ్చిన వరదలో ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా, పోచారం, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావంతో వేలాది ఎకరాల సోయా, మొక్కజొన్న, పత్తి, వరి పంట పొలాలు నీట మునిగిపోయా యి. కామారెడ్డి చరిత్రలోనే 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు ఒక్కసారిగా జలవిలయం సృష్టించాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44 వ జాతీయ రహదారిపై ఎడ్లకట్ట వాగు పొంగి పొర్లడంతో ఒకవైపు రోడ్డు తెగిపోయింది.
దాంతో బుధవా రం రాత్రి వరకు జాతీయ రహదారిని మూసివేసిన అధికారులు రాత్రి వరకు జేసీబీ సహాయంతో నీటిని మళ్లించి ఒకవైపు రాకపోకలను క్లియర్ చేశారు. పాల్వం చ మండల కేంద్రంలో వాగు ప్రవాహం రోడ్డు పైనుం చి రావడంతో రహదారి దెబ్బతింది. బ్రిడ్జి పరిస్థితిపై ఆందోళన నెలకొనడంతో రాకపోకలను నిలిపివేశారు. దాంతో కామారెడ్డి-సిరిసిల్ల రాకపోకలు నిలిచిపోయా యి. మరోవైపు లింగంపేట మండలం కొట్టాల్ వద్ద రోడ్డు తెగిపోవడంతో కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దేవివిహార్ మొదటి గేటు వద్ద వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రాత్రంతా వర్షంలోనే పర్యటించారు. గురువారం ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా ప్రత్యేక అధికారి హనుమంతు గాంధీ వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.
అధికారు లతో నష్ట జరిగిన దానిపై అంచనా వేయాలని ఆదేశించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పర్యటించారు. వరద ప్రాంతాల బాధితుల కోసం కామారెడ్డి పట్టణంతో పాటు నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మద్నూర్ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
బాధితులకు భరోసా కల్పించాలి: మంత్రి సీతక్క
వరద బాధితుల వద్దకు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి భరోసా కల్పించాలని ఉమ్మడి నిజామా బాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం సాయంత్రం కామారెడ్డిలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితులపై ఎస్పీ కార్యాల యంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
హాస్టల్‌లో చిక్కుకున్న 300 మంది విద్యార్థుల ను రక్షించడం, పోచారం డ్యామ్ కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతా ల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని, ప్రమాదకర రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందు కు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. వరద ప్రభావంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
మండల స్థాయికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని, వాగులు, చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పోచారం డ్యామ్ పరిస్థితి గురించి అధికారుల నివేదిక ప్రకారం, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, డ్యామ్ సురక్షితంగానే ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
రెండు రోజులపాటు పాఠశాలలు బంద్
కామారెడ్డి జిల్లాలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు బందు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
200 మందిని రక్షించిన పోలీసులు
ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాలతో పాటు వరదలో చిక్కుకున్న మొత్తం ౨౦౦ మందిని జిల్లా పోలీసులు రక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణి ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఉండి పనులు చేస్తున్న 8 మంది కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకొని, బిక్కుబిక్కు మంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. తమను ఎవరు కాపాడుతారోనని ఎదురుచూసిన కార్మికులను ఎస్పీ రాజేష్‌చంద్ర ఎన్‌డీఆర్‌ఎస్ బలగాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు.
జిల్లా కేంద్రంలోని జిఎస్‌ఆర్ కాలనీలో బుధవారం వరద నీటిలో చిక్కుకున్న 150 మందిని పట్టణ సీఐ నరహరి పోలీస్ సిబ్బందితో వెళ్లి తాళ్ల సహాయంతో, తమ వీపుపై మోస్తూ బయటకు తీసుకువచ్చారు. ఇదే కాలనీ పక్కన ఉన్న హౌసింగ్‌బోర్డ్‌లోని కౌండిన్య అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న 50 మందిని కాపాడారు. జీఆర్ కాలనీలో చిక్కుకున్న మరో ముగ్గురిని ఎన్డిఆర్‌ఎఫ్ బృందం రక్షించింది.
దోమకొండ మండలం సంగమేశ్వర్ వాగు ప్రవాహంలో బుధవారం సాయంత్రం కారుతో పాటు కొట్టుకుపోయిన ఇద్దరుని జెసిబి సహాయంతో రాత్రి 9 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తెచ్చారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి చెరువులో చిక్కుకున్న ముగ్గురిని బుధవారం రాత్రి బోటు సహాయంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. జి.ఎస్.ఆర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో నిలిపిన 8 కార్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.
కామారెడ్డి సరంపల్లి వద్ద గల ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి ఉధృతిలో చిక్కుకున్న సుమారు 300 మంది విద్యార్థులను బుధవారం రాత్రి పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కట్టేసిన ఆవులను తీసుకువచ్చేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు పాల్వంచ వాగులో చిక్కుకోగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రక్షించింది.
అర్గొండలో 44 సెం.మీ.లు
రాష్ట్రంలో బుధ, గురువాలు జోరు వానలు కురిశాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 44 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.5, మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండలం సర్దన గ్రామంలో 31.6, కామారెడ్డిలో 30.8, ఇదే జిల్లాలోని తాడ్వాయిలో 28.9, నిర్మల్ జిల్లా వద్యాల్‌లో 28.1, కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో 27.9, మెదక్ జిల్లా నాగాపూర్‌లో 27.8, నిర్మల్ విశ్వనాథ్‌పేట్‌లో 24.1, ముజిగిలో 23.2, మెదక్ చేగుంలో 23.1, రామాయంపేటలో 20, మెదక్‌లో 20, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 20.7, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లిలో 19.8, కుమ్రంభీం జిల్లా రుబ్బెన గ్రామంలో 17.8, నిర్మల్ జిల్లా సాయినగర్‌లో 17.4, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లెలో 17.4 వర్షపాతం నమోదైంది.
దెబ్బత్ని రైల్వే ట్రాక్
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల రైల్వే ట్రాక్ కింద నుంచి వరద ఉధృతితో ట్రాక్ దెబ్బతింది. దాంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. రాయలసీమ ఎక్స్ పెస్‌ను రద్దు సింది. మహారాష్ర్ట, కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి వైపు వెళ్లే రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.