08-09-2025 02:07:30 AM
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బండి సంజయ్‌కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్
కామారెడ్డి బీసీ సభతో మోదీ, అమిత్‌షా కళ్లు తెరుస్తారని వ్యాఖ్య
సభాస్థలిని పరీశీలించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ
కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): నిజంగా బండి సంజయ్ బీసీ అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఆమోదింపజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ చేశారు. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడిగే మీరు బీసీల రిజర్వేషన్‌పై ఎందుకు మాట్లాడరు అంటూ నిలదీశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ సభ స్థలిని ఆదివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్, వాకిటి శ్రీహరి, సీతక్కలతో కలిసి పరిశీలించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మోకాలు ఒడ్డుతున్నారని ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో బీసీ బిల్లుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జై చెప్పి కేంద్రంలో మాత్రం నై అంటున్నారని విమర్శించారు.
బిజెపి నాయకులు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం కాదు పథకాల పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బిజెపికి లేదన్నారు. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించేందుకు ముందుకు వచ్చారన్నారు.
అందుకే కామారెడ్డి గడ్డపై విజయోత్సవ వేడుకలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా రెండు లక్షల మంది బీసీలతో సభ నిర్వహించి తీరుతామని అన్నారు. బీసీల శంఖారావం చూసి ప్రధాని మోదీ, అమిత్‌షా కళ్లు తెరిచి, దిగి రావాలని చెప్పారు. బహిరంగ సభలో బండి సంజయ్, కిషన్‌రెడ్డిల నిజస్వరూపం బయట పెడతామని చెప్పారు.
కవిత మాటలు ప్రజలు నమ్మరు
కవిత మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని మహేశ్‌గౌడ్ అన్నారు. పది సం వత్సరాలు దోచుకున్న కెసిఆర్ కుటుంబం పంచుకునే లెక్కల్లో తేడాలు రావడంతో లొల్లి పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మూడు ముక్కలు కావడం ఖాయమని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.
మంత్రులకు తప్పిన ప్రమాదం
కామారెడ్డిలో సన్నాహక సభ సమావేశాన్ని ముగించుకొని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కారులో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సురేఖ, వాకిటి శ్రీహరి వెళ్తున్నారు. ఆ కాన్వాయ్‌లోకి అడ్డంగా మధ్యలోకి కారు రావడంతో దాన్ని తప్పించబోయి డివైడర్‌కు షబ్బీర్ అలీ కారు ఢీకొంది. డ్రైవర్ చాకచక్యంతో పీసీసీ అధ్యక్షుడు, నలుగురు మంత్రులు సురక్షితంగా బయటపడ్డారు.
కనీవినీ ఎరుగని రీతిలో సభ: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలో నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని అన్నారు. జనగణన, కులగణన శాస్త్రీయ బద్దంగా చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, కుట్రలు చేసినా, గుడ్డ కాల్చి మీద వేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నిజాయతీ, నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి ద్వారా ఎన్నికల్లో ప్రకటించామని, ఇచ్చిన హామీ ప్రకారం తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని తెలిపారు. మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభ దద్దరిల్లిపోవాలని, దాంతో కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తలని అన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మదన్ మోహన్‌రావు, లక్ష్మీకాంత్‌రావు, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వెడ్మా బొజ్జు, స్వయంకృషి, విప్ ఆది శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆకుల లలిత, వారికెలా నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.