calender_icon.png 8 September, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యూటీఫుల్ ‘బ్లడ్’ మూన్

08-09-2025 01:16:22 AM

  1. వీక్షకులకు కనువిందు చేసిన ఎర్రటి చందమామ
  2. రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2.25 వరకు దర్శనం
  3. 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం
  4. భారతదేశ వ్యాప్తంగా ఆసక్తిగా వీక్షించిన ప్రజలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: నల్లని ఆకాశ వీధిలో అరుణారుణ వర్ణంలో చందమామ కనువిందు చేశాడు. వీక్షకులను తన ముగ్ధమోహన రూపంతో ఆకట్టుకున్నాడు. మూడేళ్ల తర్వాత చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఎరుపు రంగంలో అందంగా కనిపించాడు. చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు. పలు చోట్ల ప్రజలు తమ ఫోన్లలో చంద్రగ్రహణం దృశ్యాలను బందించారు.

చంద్రగ్రహణాన్ని స్పష్టంగా వీక్షించేందుకు పలు చోట్ల టెలిస్కోప్స్ ఏర్పాటు చేశారు. చాలా విరామం తర్వాత ఏర్పడిన చంద్రగ్రహణం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున గ్రహణాన్ని వీక్షించేందుకు క్యూలలో నిల్చున్నారు. ఆదివారం రాత్రి 8.58కి మొదలైన చంద్రగ్రహణం సోమవారం అర్ధరాత్రి 2.25 వరకు కొనసాగింది. ఇక రాత్రి 11 గంటల తర్వాత మొదలైన సంపూర్ణ చంద్రగ్రహణం దాదా పు 82 నిమిషాల పాటు కొనసాగింది.

అర్ధరాత్రి దాటిన తర్వాత 12.22కి సంపూ ర్ణచంద్రగ్రహణం వీడింది. 11.41కి చంద్రుడు పూర్తిగా మాయం అయిపోయి ఎరుపురంగులోకి మారిపోయాడు. సోమవారం ఉదయం 1.26 వరకు పాక్షికంగా చంద్రుడు భూమి నీడలోనే ఉన్నాడు. 2.25 గంటలకు గ్రహణం పూర్తిగా వీడిపోనుందని పలువురు ఖగోళశాస్త్రవేత్తలు ప్రకటించారు.

సూర్యగ్రహణం చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి కానీ చంద్ర గ్రహణం చూసేందుకు ఎటువంటి పరికరాలు లేకున్నా పర్లేదు. బైనాక్యులర్ విజన్స్, టెలీస్కోప్‌ల ద్వారా గ్రహణాన్ని చూస్తే మరింత స్పష్టంగా కనిపించనుంది. పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరా బాద్, కోల్‌కతాతో పాటుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపించింది. 

బ్లడ్ మూన్‌గా చందమామ.. 

చంద్రగ్రహణం సందర్భంగా చందమామ బ్లడ్ మూన్ అవతారంలో పూర్తి ఎరుపు రంగులో దర్శనం ఇచ్చాడు. పాక్షికంగా కాకుండా సంపూర్ణంగా చంద్రగ్ర హణం ఏర్పడినపుడు చంద్రుడు ఎరుపు రంగు కాంతిలో మనకు దర్శనం ఇస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్ అని వ్యవహరిస్తారు. బ్లడ్ మూన్ దృశ్యాలు కూడా భారత్‌లో కనువిందు చేశాయి. గ్రహణం గురించి ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉంటాయి.

ఆ అపోహలను తొలగించేందుకు పలువురు ఏర్పా ట్లు చేశారు. ఐరోపా, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లలో పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే దర్శ నం ఇచ్చింది. చంద్రగ్రహణం సంభవించిన సమయంలో చంద్రుడిపై భూగ్రహం నీడపడుతుంది. దాంతో చంద్రుడు పూర్తిగా మసక బారిపోతాడు. కానీ కొన్ని సార్లు మాత్రం ఎరుపురంగులో ప్రకాశిస్తాడు. 2028 వరకు ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం రాదని శాస్త్రవేత్తలు తెలిపారు.